Hathnoora: హత్నూర బాలుర హాస్టల్‌లో నరకం నాసిరకం భోజనంపై విద్యార్థుల ఆందోళన
Hathnoora: సంగారెడ్డి జిల్లా హత్నూర బాలుర వసతి గృహంలో పురుగుల అన్నం, నాసిరకం కూరలు. మెనూ అమలు చేయని వార్డెన్. కనీస సౌకర్యాల్లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు.
Hathnoora: హత్నూర బాలుర హాస్టల్‌లో నరకం నాసిరకం భోజనంపై విద్యార్థుల ఆందోళన
హత్నూర: హత్నూర బాలుర వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసతి గృహంలో మొత్తం 43 మంది విద్యార్థులు ఉండగా, వారికి అందిస్తున్న ఆహారం నాసిరకంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బియ్యంలో పురుగులు, పుచ్చిపోయిన పప్పు, పల్లీలు, నల్లబడిన చింతపండు వాడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. రాత్రి కూర పేరుతో ఒక బకెట్ నిండా ఆలుగడ్డలు, అందులో కేవలం రెండు టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మెనూలో ఒకటి చూపించి, వంట మాత్రం మరొకటి చేస్తున్నారని, సమయానికి పాలు, గుడ్లు కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. వారానికి నాలుగు రోజులు గుడ్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రెండు రోజులు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.
వసతి గృహంలో వాచ్‌మన్ ఒకేసారి వంట మనిషిగా, వాచ్‌మన్‌గా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వార్డెన్ కూడా సమయపాలన పాటించకుండా విధులు ముగిసేలోపే వెళ్లిపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
టాయిలెట్ గదుల్లో నీటి నల్లాల సౌకర్యం లేకపోవడం, తలుపులు సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే విద్యుత్ స్విచ్ బోర్డులు ప్రమాదకర స్థితిలో ఉండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
43 మంది విద్యార్థులకు వారానికి ఇవ్వాల్సిన 300 గుడ్లకు బదులుగా కేవలం 240 గుడ్లు మాత్రమే అందుతున్నాయని, మిగిలిన 60 గుడ్లు ఏమయ్యాయో విచారణ జరపాలని విద్యార్థులు కోరుతున్నారు.
అలాగే విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు చికెన్, మటన్ వంటి ప్రత్యేక ఆహారం అందించలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహంలోని సమస్యలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.




