Sangareddy: పూర్వవైభవం కోల్పోతున్న జోగిపేట.. వలసబాటలో వ్యాపారులు, నిరుద్యోగులు!
Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని చారిత్రాత్మక జోగిపేట పట్టణం మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు లేక వలసలతో వెలవెలబోతోంది.
Sangareddy: పూర్వవైభవం కోల్పోతున్న జోగిపేట.. వలసబాటలో వ్యాపారులు, నిరుద్యోగులు!
Sangareddy: నిజాం కాలం నాటి నుండి చుట్టుపక్కల వందలాది గ్రామాలకు పెద్ద వ్యాపార కేంద్రంగా వెలిగిన పట్టణం అది... ఎంతో మందికి జీవనోపాధినిచ్చిన చారిత్రాత్మక ప్రాంతం అది ఉమ్మడి మెదక్ జిల్లాలోనే వ్యాపారాలకు, వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట పట్టణం ఇప్పుడు వెలవెలబోతోంది.
అవును మీరు వింటున్నది నిజమే. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, మౌలిక వసతుల లేమితో జోగిపేట పట్టణం రోజురోజుకూ తన పూర్వవైభవాన్ని కోల్పోతోంది. ఒక మంచి స్కూల్ లేదు. అత్యవసర వైద్యం అందించే కార్పొరేట్ ఆసుపత్రి లేదు.. చివరకు పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కు కూడా కరువైంది.పాలకుల నిర్లక్ష్యానికి బలైపోతూ.. దశాబ్దాల వెనక్కి నెట్టబడుతోంది!
ముఖ్యంగా పట్టణంలో ఉన్న రెండు సినిమా థియేటర్లు మూతపడటం ఇక్కడి వ్యాపార రంగంపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. గతంలో ఆందోళ్, చౌటకూర్, టెక్మాల్ వంటి పరిసర గ్రామాల ప్రజలు సినిమా చూడడానికి జోగిపేటకు వచ్చేవారు. వారు రావడం వల్ల ఇక్కడి హోటళ్లు, బేకరీలు, బట్టల దుకాణాలు, కిరాణా స్టోర్లు కస్టమర్లతో కళకళలాడేవి.
కానీ, ఒక థియేటర్ షాపింగ్ కాంప్లెక్స్‌గా మారడం మరో థియేటర్ భాగస్వాముల గొడవలు, పంచాయతీలతో మూతపడటం వల్ల పట్టణంలో సందడి పూర్తిగా తగ్గిపోయింది. వినోదం కోసం వచ్చే జనం లేకపోవడంతో వ్యాపారాలు దివాలా తీసే పరిస్థితికి వచ్చాయి. చిరువ్యాపారుల నుండి ఉద్యోగుల వరకు అందరూ జోగిపేటను వీడి కుటుంబాలతో సహా సంగారెడ్డి, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వలస బాట పడుతున్నారు.
పట్టణీకరణ అంటే కేవలం సిమెంట్ రోడ్లు వేయడం కాదు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం. కానీ జోగిపేటలో పరిస్థితి ఏంటి? ఉన్న రెండు సినిమా థియేటర్లలో ఒకటి షాపింగ్ కాంప్లెక్స్‌గా మారింది. ఇంకొకటి భాగస్వామ్య వివాదాలు పంచాయితీలతో మూతపడింది.
వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి సినిమా చూద్దామన్నా థియేటర్ లేదు పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కు లేదు కనీసం ప్రశాంతంగా కూర్చుని తినడానికి ఒక మంచి రెస్టారెంట్ కూడా లేదు!"
అన్నిటికంటే ఘోరం విద్య , వైద్యం కోసం ఈ పట్టణం పక్కనున్న సంగారెడ్డిపై ఆధారపడాల్సి రావడం. నాణ్యమైన స్కూల్స్, కాలేజీలు లేక ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని, సరైన రవాణా సౌకర్యం లేకపోయినా సంగారెడ్డి హైదరాబాద్ వైపు పరుగులు తీస్తున్నారు.
ఇక అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే ఒక్క మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఇక్కడ లేదు! డెలివరీ కేస్ అయినా.. రోడ్డు ప్రమాదం అయినా సంగారెడ్డికో, హైదరాబాద్‌కో వెళ్లే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి!"
వ్యాపారమే నమ్ముకున్న గుండెలు ఈరోజు జోగిపేటలో రోదిస్తున్నాయి! ఉదయం షాపు తీస్తే.. రాత్రి వరకు ఒక్క గిరాకీ వచ్చే పరిస్థితి లేదు. చేతిలో పైసా రాకపోయినా నెల తిరిగేసరికి వేలాది రూపాయల కిరాయిలు కట్టాలి, కరెంట్ బిల్లులు కట్టాలి! తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఉన్న పెట్టుబడి కరిగిపోతుంటే ఆ భారాన్ని మోయలేక.. గుండె నిండా ఆవేదనతో.. కళ్లల్లో నీళ్లతో వ్యాపారులు తమ షాపులకు తాళాలు వేసుకుని తప్పుకుంటున్నారు!
పట్టణంలో జనాభా తగ్గడం, కొనుగోలు శక్తి పడిపోవడంతో స్థానిక వ్యాపారాలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి దివాలా తీస్తున్నాయి. అందుకే వ్యాపారులు, ఉద్యోగులు తమ కుటుంబాల భవిష్యత్తు కోసం ఇల్లు వాకిలి వదిలేసి సంగారెడ్డికి షిఫ్ట్ అయిపోతున్నారు. కళ్లముందే ఒక చారిత్రాత్మక పట్టణం ఖాళీ అవుతుంటే మన నాయకులు ఏం చేస్తున్నారు?"పాలకులారా.. ఈ వ్యాపారాల సంక్షేమానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి?"అన్ని జోగిపేట పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు.
ఇదంతా ఒకెత్తయితే.. జోగిపేట నిరుద్యోగ యువత ఆవేదన వర్ణనాతీతం! డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి.. చేతిలో సర్టిఫికెట్లు పట్టుకుని ఉద్యోగాల కోసం వేల మంది యువత ఎదురుచూస్తున్నారు. 'జోగిపేట పరిధిలో పరిశ్రమలు స్థాపించండి.. మాకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించండి' అని నిరుద్యోగులు నెత్తీనోరూ బాదుకుంటున్నా నాయకులకు వినిపించడం లేదు.
పక్కనే ఉన్న పటాన్చెరు, జహీరాబాద్‌లలో పరిశ్రమలు వస్తున్నప్పుడు జోగిపేటపై ఈ సవతి తల్లి ప్రేమ ఎందుకు? ఇక్కడ పరిశ్రమలు వస్తే వలసలు ఆగుతాయి. యువత భవిష్యత్తు బాగుపడుతుంది. కానీ ఆ దిశగా అడుగులు వేసే నాథుడే కరువయ్యాడు అన్ని వాపోయారు.




