Jogipet: జోగిపేటలో నూకల బస్తాల దొంగతనం గుట్టురట్టు
Jogipet: జోగిపేటలో వ్యాపారి దుకాణం గోడకు కన్నం వేసి 39 నూకల బస్తాలను ఎత్తుకెళ్లిన ఐదుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు.
Jogipet: జోగిపేటలో నూకల బస్తాల దొంగతనం గుట్టురట్టు
సంగారెడ్డి జిల్లా: జోగిపేటలో భారీ దొంగతనం గుట్టురట్టు చేశారు పోలీసులు. పట్టణంలో సంచలనం సృష్టించిన నూకల బస్తాల దొంగతనం కేసును జోగిపేట పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఐదుగురు దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి లక్షల రూపాయల విలువైన 39 నూకల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణానికి చెందిన వ్యాపారి బచ్చు ఆనంద్ దుకాణమే లక్ష్యంగా ఈ నెల 19న అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. షాప్ వెనుక గోడకు పెద్ద కన్నం వేసి, లోపల నిల్వ ఉంచిన సుమారు 39 బస్తాల నూకలను గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. మరుసటి రోజు ఉదయం బాధితుడు షాప్ తెరిచి చూసేసరికి గోడకు రంధ్రం ఉండటం, నూకల బస్తాలు మాయమవడంతో జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా ఈరోజు జోగిపేట మార్కెట్ యార్డు సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నూకల బస్తాలతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు దొంగతనం గుట్టు విప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే తాము గోడకు కన్నం వేసి నూకలు దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో జోగిపేటకు చెందిన అలకుంట గోపాల్, మక్కల యాదయ్య, మక్కల శ్రీను, మక్కల నవీన్, అలకుంట అశోక్ ఉన్నారు. నిందితుల నుంచి దొంగిలించబడిన 39 నూకల బస్తాలతో పాటు, నేరానికి ఉపయోగించిన గడ్డపారను, 4 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసులను స్థానిక ప్రజలు, వ్యాపారులు అభినందిస్తున్నారు.




