Medak: మైనర్లకు వాహనాలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు ఎస్‌ఐ హెచ్చరిక!

Medak: ఎస్‌ఐ అమరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం పాటలు, నృత్యాల ద్వారా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై వినూత్న అవగాహన కల్పించింది.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 1 Aug 2026 10:10 PM IST
Medak
X

Medak: మైనర్లకు వాహనాలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు ఎస్‌ఐ హెచ్చరిక!

మెదక్: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి మెదక్ జిల్లా బృందం కౌడిపల్లి బస్టాండ్‌లో వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కౌడిపల్లి ఎస్‌ఐ అమరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాటలు, నృత్యాల రూపంలో ప్రజలకు సందేశాలు అందించారు.

"ఒక్కే ఒక ప్రయాణం... చేరాలిరా క్షేమంగా గమ్యం" అనే సందేశంతో కళాకారులు హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం ప్రమాదాలకు కారణమవుతుందని ప్రజలకు వివరించారు. అలాగే ఎస్‌ఐఆర్ ప్రాముఖ్యత, ఓటు హక్కు విలువ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటల సాగు వంటి అంశాలపై కూడా పాటల రూపంలో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ అమరేందర్ మాట్లాడుతూ.. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, బీమా, కాలుష్య ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని, మైనర్ బాలబాలికలకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం, అతివేగంగా వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మెదక్ జిల్లా సభ్యులు కొమ్ముల శేఖర్ గౌడ్, నేనావత్ మదన్ సింగ్, శివొళ్ల కృష్ణ, కారంగుల మాధవి, ధరావత్ రాజు, డిక్కొండ భాస్కర్, తండా బిక్షపతి, పోలీసు సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story