Sangareddy: మంజీరా పాఠశాలలో ఘనంగా ‘మైత్రి సమ్మేళనం’.. దీపావళి సంబరాలు
Sangareddy: మంజీరా పాఠశాలలో మైత్రి సమ్మేళనం వేదికగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహణ. హాలోవీన్ వేషధారణలు, ఫుడ్ స్టాల్స్, లక్కీ డ్రాలతో ఆకట్టుకున్న చిన్నారులు.
Sangareddy: మంజీరా పాఠశాలలో ఘనంగా ‘మైత్రి సమ్మేళనం’.. దీపావళి సంబరాలు
సంగారెడ్డి: మైత్రి సమ్మేళనం వేదికగా మంజీరా పాఠశాలలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయాలకు ఆధునికతను జోడిస్తూ నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. హాలోవీన్ థీమ్, ఆకర్షణీయమైన ఫుడ్ స్టాల్స్, పంట ఉత్పత్తుల ప్రదర్శనలు, లక్కీ డ్రాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జగన్ మోహన్, ప్రిన్సిపల్ డి. రేవతి, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేసేలా కార్యక్రమాలను రూపొందించారు. తల్లిదండ్రులు స్వయంగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం, వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దీపావళి పండుగ వెనుక ఉన్న నైతిక సందేశాన్ని వివరిస్తూ నరకాసుర వధ ప్రాముఖ్యతను చిన్నారులకు తెలియజేశారు. ప్రతి మనిషిలో ఉండే అసూయ, అహంకారం, కోపం, ద్వేషం వంటి చెడు లక్షణాలను విడిచిపెట్టి ప్రేమ, ఆప్యాయత, మానవత్వంతో జీవించాలని సూచించారు.
వేడుకల్లో భాగంగా పేరెంట్స్, స్టూడెంట్స్, స్టాఫ్‌కు ప్రత్యేకంగా లక్కీ డ్రాలు నిర్వహించారు. పాఠశాల ఉద్యోగులు, డ్రైవర్లు, క్లీనర్లకు సైతం ప్రత్యేక లక్కీ డ్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరినీ వేడుకల్లో భాగస్వాములను చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ జగన్ మోహన్, ప్రిన్సిపల్ డి. రేవతి మాట్లాడుతూ కార్యక్రమ విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, డ్రైవర్లు, క్లీనర్లు, ఫుడ్ స్టాల్స్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యతో పాటు సామాజిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేయడమే ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దీపావళి శుభాకాంక్షలతో వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.




