Medak: శంకరంపేట, చేగుంట పీఎస్‌లలో అదనపు ఎస్పీ తనిఖీలు!

Medak: శంకరంపేట-ఆర్, చేగుంట పీఎస్‌లను మెదక్ అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తనిఖీ చేశారు. CCTNS అప్‌డేట్, డ్రగ్స్-సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహనకు ఆదేశించారు.

RAJU,TOOPRAN
Published on: 3 Nov 2026 11:17 PM IST
Medak
X

Medak: శంకరంపేట, చేగుంట పీఎస్‌లలో అదనపు ఎస్పీ తనిఖీలు!

మెదక్: నేరాల నియంత్రణకు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన శంకరంపేట-ఆర్, చేగుంట పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా CCTNS, ఈ-సాక్ష్య అప్లికేషన్లలో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలి: అదనపు ఎస్పీ, డ్రగ్స్ దుష్పరిణామాలు, సైబర్ నేరాలపై ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్యపరచాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ తనిఖీలలో తూప్రాన్ సీఐ వెంకట రాజా గౌడ్, శంకరంపేట-ఆర్ ఎస్ఐ శివనందం, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN