Medak: ధాన్యం కొనుగోళ్లలో జాప్యమెందుకు? - కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

Medak: మెదక్ జిల్లా శంకరంపేట మండలం గవ్వలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంపై బీఆర్ఎస్ నేత కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడారు.

NAGARAJ, MEDAK
Published on: 17 Nov 2026 4:31 PM IST
Medak
X

Medak: ధాన్యం కొనుగోళ్లలో జాప్యమెందుకు? - కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

మెదక్: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు. నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడం, లారీల కొరతతో ధాన్యం రవాణా నిలిచిపోవడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడుపాయల నుంచి ఎర్రవెల్లి వరకు బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన పాదయాత్రకు స్వాగతం పలికేందుకు వచ్చిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని శంకరంపేట మండలం గవ్వలపల్లి వద్ద రైతులు కలిసి తమ సమస్యలను వివరించారు. గవ్వలపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదని, లారీల కొరత కారణంగా ధాన్యం మిల్లులకు తరలించడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై వెంటనే స్పందించిన తిరుపతిరెడ్డి ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు. తక్షణమే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, ధాన్యం రవాణాకు సరిపడా లారీలను ఏర్పాటు చేయాలని, కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజులుగా రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు కష్టపడి పండించిన ధాన్యం రోజుల తరబడి కల్లాల్లోనే ఉండిపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు లారీల కొరతను పరిష్కరించి ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK