Medak: కార్మిక చట్టాల రక్షణకై సంఘటితంగా పోరాడుదాం: మెదక్‌లో ఘనంగా సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం!
Medak: మెదక్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు (CITU) 56వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కేంద్రం నూతన లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు.
Medak: కార్మిక చట్టాల రక్షణకై సంఘటితంగా పోరాడుదాం: మెదక్‌లో ఘనంగా సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం!
మెదక్: దేశంలోని కార్మిక, కూలీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం గత 56 సంవత్సరాలుగా నిరంతర పోరాటాలు సాగిస్తున్న సిఐటియు56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ మున్సిపల్ కార్యాలయం ముందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం సిఐటియు జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి అనేక హక్కులు కార్మిక ఉద్యమాల ఫలితంగానే సాధ్యమయ్యాయని తెలిపారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు.అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్మికుల ఐక్యతే వారి బలం అని, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత సంఘటితంగా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.కార్మిక వర్గ విముక్తి, సమాన హక్కులు, సామాజిక న్యాయం సాధన కోసం సిఐటియు తన పోరాట పంథాను కొనసాగిస్తుందని పేర్కొన్నారు.నూతన లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్మి కుల హక్కులను బలహీనపరిచే ఈ కోడ్ ల అమలును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన కనీస వేతనాల్లో శాస్త్రీయత లోపించిందని విమర్శించారు. పెరిగిన నిత్యావసర ధరలు, జీవన వ్యయం, కార్మిక కుటుంబాల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా వేతనాలు నిర్ణయించారని ఆరోపించారు. కార్మికులకు గౌరవప్రదమైన జీవనం అందేలా శాస్త్రీయ ప్రమాణాలతో కనీస వేతనాలను పునర్నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలన్నింటిపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరారు. నూతన లేబర్ కోడ్ ల ఉపసంహరణ, శాస్త్రీయ ప్రమాణాలతో కనీస వేతనాల నిర్ణయం, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు నాగరాజు ఏసు బద్రీ బాల్ రాజ్ మహేష్ మురళీ ఎల్లవ్వ ఉషవ్వ నాగరాణి బాలు అనిత బాలమణి కార్యకర్తలు పాల్గొన్నారు.




