Medak: మెదక్ DM&HO ఆఫీసులో నియామకాల అక్రమాలు

Medak: మెదక్ జిల్లా వైద్యారోగ్య శాఖలో నోటిఫికేషన్లు లేని దొంగ నియామకాల కలకలం

NAGARAJ, MEDAK
Published on: 31 May 2026 8:54 PM IST
Medak
X

Medak: మెదక్ DM&HO ఆఫీసులో నియామకాల అక్రమాలు

మెదక్: మెదక్ జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో 2026 సంవత్సరం ఆరంభం నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయకుండా పలు పోస్టులను భర్తీ చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువత, స్థానిక అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ డబుల్ బెడ్ రూమ్ లో గల బస్తీ దవఖానాలు జిల్లా వైద్యాధికారి బంధువులు డాక్టర్ గా ఎలాంటి అనుమతులు లేకుండా పనిచేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో ఫార్మసిస్టు పోస్టును నోటిఫికేషన్ లేకుండానే భర్తీ చేసినట్లు సమాచారం. సంబంధిత వ్యక్తి పదవీ విరమణ చేసిన ఉద్యోగి కుటుంబానికి చెందిన వ్యక్తి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అలాగే NHM పరిధిలో మూడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండానే భర్తీ చేసినట్లు సమాచారం. ఇందులో స్థానిక జోన్‌కు చెందని నాన్-లోకల్ వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వైద్యాధికారి కార్యాలయంలో ఇప్పటికే విధుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నప్పటికీ, వారికి ల్యాబ్ పనులు అప్పగించకుండా మరికొందరికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించడం ప్రజాధన దుర్వినియోగానికి నిదర్శనమని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.అలాగే క్షయ నివారణ విభాగంలో ల్యాబ్ సూపర్వైజర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను కూడా పారదర్శకత లేకుండా భర్తీ చేసినట్లు సమాచారం అందుతోంది.

DM&HO కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ల్యాబ్ సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మెదక్ జిల్లా క్షయ నివారణ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ హరిప్రసాద్ కు సంబంధించిన ప్రైవేట్ ఆసుపత్రి (స్థానికంగా “అప్ప దావాఖాన”గా పిలవబడుతున్న ఆసుపత్రి)లో పనిచేస్తున్న ఒక ల్యాబ్ టెక్నీషియన్‌కు, ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ లేదా పారదర్శక ఎంపిక ప్రక్రియ లేకుండానే క్షయ నివారణ కార్యాలయంలో ఉద్యోగం కల్పించినట్లు సమాచారం అందుతోందని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో ప్రయోజనాల ఘర్షణ, అధికార దుర్వినియోగం జరిగి ఉండవచ్చనే అనుమానాలువ్యక్తమవుతున్నాయి.గతంలో కూడా ఇలాంటి నియామకాల ద్వారా కొందరు వెయిటేజ్ పొంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు పొందిన సందర్భాలు ఉన్నాయని స్థానిక నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని 2026లో జరిగిన అన్ని నియామకాలపై స్వతంత్ర విచారణ జరిపి, అక్రమ నియామకాలను రద్దు చేసి, బాధ్యులపై శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.భవిష్యత్తులో అన్ని పోస్టులను అధికారిక నోటిఫికేషన్, మెరిట్, రోస్టర్ మరియు స్థానికత నిబంధనల ప్రకారం మాత్రమే భర్తీ చేయాలని, స్థానిక నిరుద్యోగులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story