Medak: తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు: కలెక్టర్!

Medak: ఎల్‌నినో ప్రభావంతో డిసెంబర్ తర్వాత సింగూరు నీటి సరఫరా నిలిచే అవకాశం ఉండటంతో మెదక్ జిల్లాలో రూ.42 కోట్లతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

NAGARAJ, MEDAK
Published on: 4 Nov 2026 5:01 PM IST
Medak
X

Medak: తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు: కలెక్టర్!

మెదక్, నవంబర్ 4: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని మెదక్ జిల్లా యంత్రాంగం ముందస్తు కార్యాచరణకు సిద్ధమవుతోంది. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. డిసెంబర్ తర్వాత సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు బుధవారం హవేలీ ఘన్‌పూర్ మండలం సర్దన గ్రామంలోని చెక్‌డ్యామ్‌ను మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ప్రత్యామ్నాయ నీటి సరఫరా కోసం రూపొందించిన మ్యాప్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నీటి కొరతను ముందుగానే అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లాకు రూ.42 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు.

సర్దన చెక్‌డ్యామ్ వద్ద ప్రత్యేక గ్రిడ్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి సుమారు 3.5 కిలోమీటర్ల మేర జక్కన్నపేట గ్రామం వరకు పైప్‌లైన్ నిర్మించనున్నట్లు వివరించారు. ఈ వ్యవస్థ ద్వారా 33 గ్రామాలకు ప్రతిరోజూ ఒక్కొక్కరికి 55 లీటర్ల చొప్పున తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. సర్దనతో పాటు పొడ్చాన్‌పల్లి, కొత్తపల్లి, మిన్‌పూర్ చెక్‌డ్యామ్‌ల వద్ద కూడా గ్రిడ్ వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ నీటి వనరులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రజలు నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి వృథాను అరికట్టేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న మిషన్ భగీరథ నల్లాలను నిలిపివేసి నీటి వృథాను అరికట్టాలన్నారు. సర్పంచులు గ్రామసభల్లో తీర్మానాలు చేసి సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ మోటార్లను నిర్దిష్ట సమయాల్లో మాత్రమే నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మిగతా సమయాల్లో మోటార్లను నిలిపివేయడం ద్వారా భూగర్భ జలాల పరిరక్షణతో పాటు విద్యుత్ ఆదా సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లోని త్రీఫేజ్ మోటార్ల ద్వారా నీటిని ఓవర్‌హెడ్ రిజర్వాయర్ (ఓహెచ్‌ఆర్) ట్యాంకులకు తరలించి సరఫరా చేసే విధానాన్ని పాటించాలన్నారు.బోర్ల ఫ్లషింగ్, డీపెనింగ్, విద్యుత్ మోటార్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

రిజర్వాయర్లలో నీటి నిల్వలు, అందుబాటులో ఉన్న నీటి వనరులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా పరిస్థితులను నిరంతరం అంచనా వేస్తూ, నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చేపడుతున్న చర్యలు తాత్కాలిక నీటి కొరతను అధిగమించడమే కాకుండా భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందుబాటులో ఉంచేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణం, ఈఈ సంపత్ కుమార్, ఇంట్రా డీఈ నరేష్, తహసీల్దార్ సింధు రేణుక, విద్యుత్ శాఖ డీఈ రామేశ్వర స్వామి, గ్రామ సర్పంచ్ వినోద, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK