Medak: అయ్యప్ప మాల విరమణకు వెళ్లిన కుటుంబం.. ఇంట్లో భారీ చోరీ!

Medak: మెదక్ పట్టణం వెంకట్రావునగర్ కాలనీలో అయ్యప్ప మాల విరమణ కోసం కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి 28 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

NAGARAJ, MEDAK
Published on: 28 Nov 2026 2:36 PM IST
Medak
X

Medak: అయ్యప్ప మాల విరమణకు వెళ్లిన కుటుంబం.. ఇంట్లో భారీ చోరీ!

మెదక్ నవంబర్ 28: కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి అయ్యప్ప మాల విరమణ కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు వెళ్లడాన్ని గమనించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళం పగులగొట్టి బీరువాను ధ్వంసం చేసి సుమారు 28 తులాల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టెను ఎత్తుకెళ్లిన ఘటన మెదక్ పట్టణంలోని వెంకట్రావునగర్ కాలనీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన బిలకంటి భీమప్ప వెంకట్రావునగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయ్యప్ప మాల ధరించిన తన చిన్న కుమారుడు శబరిమల నుంచి ఇంటికి వస్తుండటంతో మాల విరమణ కార్యక్రమం కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటికి వేసిన తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు 28 తులాల బంగారు ఆభరణాల పెట్టెను అపహరించి పరారయ్యారు.

శుక్రవారం ఉదయం ఇంటి చుట్టుపక్కల అద్దెకు నివసించే వారు తాళం పగిలి ఉండటాన్ని గమనించి భీమప్పకు సమాచారం అందించారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న బాధితుడు పరిశీలించగా బీరువాలోని బంగారు ఆభరణాల పెట్టె చోరీకి గురైనట్లు గుర్తించారు. దుండగుడు బంగారు ఆభరణాల పెట్టెను తీసుకెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ ఘటనపై బాధితుడు భీమప్ప మెదక్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ మహేష్ క్లూస్ టీంతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

తమకు చెందిన బంగారు ఆభరణాలను గుర్తించి తిరిగి అప్పగించాలని బాధిత కుటుంబం పోలీసులను వేడుకుంది. చోరీకి పాల్పడిన దుండగుల కోసం గాలింపు ముమ్మరం చేశామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పట్టణ ఇన్‌స్పెక్టర్ మహేష్ తెలిపారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK