Medak: అర్హులందరికీ చేయూత పింఛన్ల పంపిణీ - మంత్రి దామోదర్

Medak: మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో మూడు మండలాలకు చెందిన 1,400 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల పత్రాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ పంపిణీ చేశారు.

UMASHANKAR, ANDOLE
Published on: 15 Nov 2026 7:35 PM IST
Medak
X

Medak: అర్హులందరికీ చేయూత పింఛన్ల పంపిణీ - మంత్రి దామోదర్

మెదక్: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను మంత్రి పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఒంటరి మహిళలు, వితంతువులు, ఇతర అర్హులైన వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన చేయూత పింఛన్ల కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 50 వేల నూతన పింఛన్లు మంజూరు చేయగా.. ఒక్క మెదక్ జిల్లాలోనే 11 వేల పింఛన్లు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు కలిపి 1,400 పింఛన్లను అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ మూడు మండలాల్లో మంజూరైన కొత్త పింఛన్లలో 965 మంది వితంతువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో బ్యాంకు లింకేజీ లేకుండానే మహిళా సంఘాలకు లక్షల రూపాయల రుణాలు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, డ్రోన్ల నిర్వహణ వంటి రంగాల్లో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. మరోవైపు గుడిసెలు లేని సమాజమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గానికి ఏటా 3 వేల 800 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. మూడు మండలాలకు కేటాయించిన 1,400 ఇళ్లలో ఇప్పటికే 400 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని.. మిగిలిన వారికి విడతలవారీగా ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పాటు అందోల్, టేక్మాల్, రేగోడ్ వంటి వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE