Medak: కోనాపూర్ సొసైటీ విచారణపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం!

Medak: మెదక్ కలెక్టరేట్‌లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో కోనాపూర్ సొసైటీ అక్రమాల విచారణ మూడేళ్లుగా కాలయాపన చేయడంపై ఎంపీ రఘునందన్ రావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

NAGARAJ, MEDAK
Published on: 27 Nov 2026 1:13 PM IST
Medak
X

Medak: కోనాపూర్ సొసైటీ విచారణపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం!

మెదక్ నవంబర్ 27: కోనాపూర్ సొసైటీలో అక్రమాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ ఎప్పటికి పూర్తవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధికారులను నిలదీశారు. విచారణ పేరుతో గత మూడేళ్లుగా కాలయాపన చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు కలెక్టర్లు మారినా విచారణ ఎందుకు కొలిక్కి రావడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఎంపీ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

కోనాపూర్ సొసైటీ పరిధిలో ఎన్ని దుకాణ సముదాయాలు ఉన్నాయి. వాటికి ఎంత అద్దె వసూలు చేస్తున్నారు. ఎవరికి దుకాణాలు కేటాయించారు? అద్దెదారుల నుంచి అడ్వాన్స్ రూపంలో ఎంత మొత్తం తీసుకుంటున్నారు. ఈ అడ్వాన్స్‌లను ఎవరి అనుమతితో నిర్ణయించారంటూ అధికారులను ప్రశ్నించారు. అలాగే పెట్రోల్ బంక్‌ను లీజుకు తీసుకున్న వారు సుమారు రూ.3 కోట్ల నష్టం ఉందని చెప్పి పరారైనట్లు పేర్కొంటూ, వారిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొసైటీలో విచారణ ప్రారంభమయ్యేలోపే సుప్రీంకోర్టు నుంచి స్టే వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, విచారణ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై స్పష్టత ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. మరోవైపు విశ్వకర్మ వర్గానికి చెందిన ఎంతమందికి రుణాలు మంజూరు చేశారని బ్యాంకర్లను ఎంపీ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కులవృత్తుల వారికి సబ్సిడీతో రుణాలు అందించే పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, బ్యాంకర్లు రుణాల మంజూరులో అనవసర ఇబ్బందులు సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందేలా బ్యాంకర్లు చొరవ చూపాలని సూచించారు. రైతులు వృద్ధులు వితంతువులు బ్యాంకర్లకు డబ్బులు బాకీ ఉంటే వారి పెన్షన్స్ ఆపి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. పెన్షన్స్ ఆపదమూలంగా వారికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ శ్రీనివాసరావుతో పాటు వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK