Medak: బస్సులో 30 తులాల బంగారం చోరీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
Medak: మెదక్ జిల్లాలో బస్సులో 30 తులాల బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠా సభ్యురాలిని అరెస్ట్ చేసి 25 తులాల నగలు స్వాధీనం.
Medak: బస్సులో 30 తులాల బంగారం చోరీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
మెదక్: బస్సు ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నిజాంపేట పోలీసులు ఛేదించారు. రాఖీ పండుగ సందర్భంగా బస్సులో చోరీకి గురైన 30 తులాల బంగారు ఆభరణాల కేసులో మేకల సంధ్య (30)ను అరెస్ట్ చేసి, ఆమె వద్ద నుంచి సుమారు 25 తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.నల్గొండ జిల్లాకు కు చెందిన సూరం స్నేహ ఆగస్టు 26న రాఖీ పండుగ సందర్భంగా తన 30 తులాల బంగారు ఆభరణాలను బ్యాగులో పెట్టుకుని నిజాంపేటలోని తల్లిగారి ఇంటికి బయలుదేరారు. నిజాంపేటకు చేరుకున్న తర్వాత బ్యాగులో నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితురాలిని గుర్తించారు.అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ మార్గదర్శకంలో, తూప్రాన్ డీఎస్పీ జె. నరేందర్ గౌడ్ పర్యవేక్షణలో రామాయంపేట సీఐ బి. సైదా, నిజాంపేట ఎస్ఐ బి. రాజేష్‌లతో కూడిన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన మేకల సంధ్యను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు.
పోలీసుల విచారణలో సంధ్య తన తల్లి సతుపాటి రాధిక, బంధువు అక్షింతల సంధ్య, బండి మోజెస్, బండి దుర్గలతో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్లు వెల్లడైందని ఎస్పీ తెలిపారు. చోరీ అనంతరం స్విఫ్ట్ కారులో హైదరాబాద్‌కు చేరుకుని, అక్కడి నుంచి ఇన్నోవా క్రిస్టాలో పరారైనట్లు పేర్కొన్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ముఠా సభ్యులు ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా పరస్పరం సమాచారాన్ని పంచుకునేవారని తెలిపారు. హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, నిజామాబాద్, మెదక్ ప్రాంతాల్లోని బస్టాండ్లలోనూ చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
నిందితురాలి నుంచి నాలుగు బంగారు చైన్లు, నాలుగు లాకెట్లు, ఒక పుస్తెల తాడు, 13 ఉంగరాలు, ఒక ప్లాటినం ఉంగరం, నల్లపూసల దండలు, కంకణాలు, గాజులు, కమ్మలు, చంపస్వరాలు, ముక్కెర, సిక పువ్వు తదితర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీటి మొత్తం బరువు సుమారు 25 తులాలుగా పేర్కొన్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల అరెస్ట్, మిగిలిన సొత్తు స్వాధీనం కోసం దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
బస్సులు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో విలువైన ఆభరణాలు, నగదు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, చోరీ జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన సీఐ సైదా, ఎస్ఐలు రాజేష్, బాలరాజ్, హెడ్ కానిస్టేబుల్ సునీత, కానిస్టేబుళ్లు రాకేశ్, భాస్కర్, నాగభూషణ్, సాజిద్, లక్ష్మణ్, రాజు, కృష్ణ, శ్రీనివాస్ నాయక్, ఐటీ కోర్ సిబ్బంది విజయ్, వెంకట్, మహేందర్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.




