Medak: చిల్లపల్లిలో దొంగల నైట్ సఫారీ.. ఒకే రాత్రి 4 ఇళ్లల్లో భారీ చోరీ!
Medak: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ పరిధిలోని చిల్లపల్లిలో అర్ధరాత్రి దారుణం. తాళాలు వేసిన 4 ఇళ్లల్లో గుర్తుతెలియని దొంగల బీభత్సం.
Medak: చిల్లపల్లిలో దొంగల నైట్ సఫారీ.. ఒకే రాత్రి 4 ఇళ్లల్లో భారీ చోరీ!
మెదక్: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్లపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని తాళాలు వేసి ఉన్న నాలుగు ఇండ్లలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఘటనాస్థలానికి చేరుకుని చోరీ జరిగిన ఇండ్లను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు పోలీసులు అండగా ఉంటారని, నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని భరోసా ఇచ్చారు.
చోరీ ఘటనపై క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని ఎస్పీ తెలిపారు. గ్రామ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో రాత్రి పహారాను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు.అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలను కోరిన ఎస్పీ, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో నగదు, బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని తెలిపారు. అవసరమైతే వాటిని వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. వీరి వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రేణుక రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, పెద్దశంకరంపేట్ పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.




