Sangareddy: సంగారెడ్డిలో 300 మంది టీబీ రోగులకు 6 నెలల పాటు పౌష్టికాహారం!
Sangareddy: సంగారెడ్డిలో క్షయ బాధితులకు యూనియన్ బ్యాంక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పోషకాహార కిట్లు పంపిణీ చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.
Sangareddy: సంగారెడ్డిలో 300 మంది టీబీ రోగులకు 6 నెలల పాటు పౌష్టికాహారం!
సంగారెడ్డి: క్షయ వ్యాధి బాధితులకు పోషకాహారం అందించేందుకు యూనియన్ బ్యాంక్ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి బాధితులకు కిట్లను స్వయంగా అందజేశారు.
క్షయ వ్యాధిగ్రస్తుల పోషకాహారం కోసం ప్రభుత్వం ఇప్పటికే నెలకు రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తోందని అధికారులు తెలిపారు. దీనికి అదనంగా యూనియన్ బ్యాంక్ సోషల్ ఫౌండేషన్ తమ సామాజిక బాధ్యత నిధుల ద్వారా రూ.25 లక్షల విలువైన పోషకాహార కిట్లను రాష్ట్రవ్యాప్తంగా 700 మంది బాధితులకు నెలకు ఒక కిట్ చొప్పున ఆరు నెలల పాటు అందించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 2026 ఆగస్టు 31 నాటికి 1,527 క్షయ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 300 మంది బాధితులను ఎంపిక చేసి పోషకాహార కిట్లను అందిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ క్షయ రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వంతో పాటు సేవా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సహకరించడం అభినందనీయమన్నారు. బాధితులకు అవసరమైన పోషకాహారం అందించడం ద్వారా వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్‌పర్సన్ టి. నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, యూనియన్ బ్యాంక్ రాష్ట్ర మేనేజర్ వి. రాధాకృష్ణన్, రాష్ట్ర సంయుక్త సంచాలకులు (క్షయ) డాక్టర్ రాజేషం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. లలితాదేవి, వైద్య విద్య సంచాలకురాలు డాక్టర్ ఎన్. వాణి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. ప్రకాష్ రావు, క్షయ నిర్మూలన కార్యక్రమ అధికారి డాక్టర్ సిహెచ్. అరుణకుమారి, వైద్య విద్యార్థులు, క్షయ నిర్మూలన పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




