Medak: మెదక్‌లో ధాన్యం కొనుగోళ్లపై నిరసన

Medak: ధాన్యం కొనుగోళ్ల జాప్యం, లారీల కొరతపై రైతన్నలతో కలిసి బైఠాయింపు.. అధికారుల తక్షణ స్పందనతో కదిలిన లారీలు.

NAGARAJ, MEDAK
Published on: 1 Jun 2026 8:36 PM IST
Medak
X

Medak: మెదక్‌లో ధాన్యం కొనుగోళ్లపై నిరసన

మెదక్: ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ లోని దయారా ఐకేపీ కేంద్రం వద్ద రైతులతో కలిసి బైఠాయించారు. ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్నప్పటికీ కొనుగోళ్లు జరగకపోవడం,లారీల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అంజిరెడ్డి రైతులతో కలిసి కేంద్రం వద్ద ధర్నాకు దిగారు.అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.

ఎమ్మెల్సీ ఆందోళనతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.రైతుల సమస్యలను తెలుసుకుని వెంటనే లారీలను ఏర్పాటు చేశారు.అనంతరం నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను పునఃప్రారంభించి,ధాన్యాన్ని లారీల్లో లోడ్ చేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. రైతు కష్టపడి పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు.

ఐకేపీ కేంద్రాల్లో లారీల కొరతను సాకుగా చూపి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి జాప్యాలు పునరావృతమైతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, పార్టీ నాయకులు ప్రసాద్, ఎంఎల్ఎన్ రెడ్డి,సతీష్,భరత్,బిక్షపతి, శివ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story