Narsapur: నర్సాపూర్ ఎల్ నినో, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన
Narsapur: నర్సాపూర్‌లో ఎల్ నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన. నీటి పొదుపు, యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తల కీలక సూచనలు.
Narsapur: నర్సాపూర్ ఎల్ నినో, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండల రైతులకు ఎల్ నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ అవగాహన కల్పించింది. నర్సాపూర్ రైతు వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులపై కీలక సూచనలు చేశారు.
నర్సాపూర్ రైతు వేదికలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ పాల్గొని ఎల్ నినో ప్రభావంపై రైతులకు వివరించారు. ఎల్ నినో పరిస్థితుల వల్ల వర్షపాతం తగ్గే అవకాశం, అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, పంటల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని తెలిపారు.
రైతులు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. తక్కువ నీరు అవసరమయ్యే కంది, పెసర, జొన్న, మినుము వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకేసారి మొత్తం భూమిలో విత్తనాలు వేయకుండా దశలవారీగా సాగు చేయాలని సూచించారు.
అలాగే నీటి వినియోగాన్ని పొదుపుగా నిర్వహించడం, నేలలో తేమను కాపాడే చర్యలు చేపట్టడం, వ్యవసాయ శాఖ సూచించిన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులను సంప్రదించి మండలానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటల వివరాలు తెలుసుకొని, తాజా సాంకేతిక సూచనలు, వాతావరణ ఆధారిత సలహాలను తీసుకుని సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్, సహాయ వ్యవసాయ సంచాలకులు సంధ్యారాణి, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి రాజు యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్, మండల వ్యవసాయ అధికారిణి దీపిక, హార్టికల్చర్ అధికారి మహేశ్వరి, వ్యవసాయ విస్తరణాధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.




