Narsapur: చెక్ బౌన్స్ కేసుల్లో రాజీతోనే శాశ్వత పరిష్కారం
Narsapur: నర్సాపూర్ కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్; చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ ద్వారా సమయం, డబ్బు ఆదా చేసుకోవాలని ఇన్‌చార్జ్ న్యాయమూర్తి ఎం. హేమలత సూచన.
Narsapur: చెక్ బౌన్స్ కేసుల్లో రాజీతోనే శాశ్వత పరిష్కారం
నర్సాపూర్: చెక్ బౌన్స్ కేసుల్లో ఇరువర్గాలు పరస్పర అవగాహనతో రాజీ కుదుర్చుకోవడం ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నర్సాపూర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇన్‌చార్జ్ న్యాయమూర్తి ఎం. హేమలత సూచించారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ పంతాలకు పోవడం వల్ల విలువైన సమయం, డబ్బు వృథా అవుతాయని, ఇరువర్గాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె పేర్కొన్నారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనలతో మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నర్సాపూర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎం. హేమలత మాట్లాడుతూ.. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఎన్‌ఐ) చట్టం కింద నమోదైన చెక్ బౌన్స్ కేసుల్లో కక్షిదారులు పరస్పర అంగీకారంతో ముందుకు వచ్చి రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఒకరిపై మరొకరు పట్టింపులకు పోకుండా, పరస్పర చర్చలతో సమస్యకు ముగింపు పలకాలని తెలిపారు.
ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా కేసులను సులభమైన పద్ధతిలో పరిష్కరించుకునే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు కూడా తగ్గుతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సహాయ న్యాయవాది డి. శ్రీధర్ రెడ్డి, మాజీ ఏజీపీ ఈ. సత్యనారాయణ, పి. సుధాకర్, సీనియర్ న్యాయవాది జాఫర్, ఏ. శ్రీనివాస్, న్యాయవాదులు ప్రభు, రవి నాయక్, రాధాబాయి, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.




