Narsapur: విపత్తు నిర్వహణ శిక్షణ పూర్తి చేసుకున్న నర్సాపూర్ విద్యార్థులు!

Narsapur: ఆపదలో ఆదుకునే ఆపదమిత్రులు: విపత్తు నిర్వహణ, సీపీఆర్‌పై 'యువ ఆపద మిత్ర' ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న నర్సాపూర్ డిగ్రీ కళాశాల 20 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు.

G Ashok Reddy, Narsapur
Published on: 23 Sept 2026 6:40 PM IST
Narsapur
X

Narsapur: విపత్తు నిర్వహణ శిక్షణ పూర్తి చేసుకున్న నర్సాపూర్ విద్యార్థులు!

నర్సాపూర్: ఆపద సమయంలో ప్రజలను ఆదుకునేందుకు నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం వాలంటీర్లు సిద్ధమయ్యారు. కళాశాలకు చెందిన 20 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు “యువ ఆపద మిత్ర” శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. హుస్సేన్ మార్గదర్శకత్వంలో ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్ కొండాపూర్‌లోని 8వ బెటాలియన్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ శిక్షణ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా ఆధ్వర్యంలో రాష్ట్ర విపత్తు స్పందన దళం పర్యవేక్షణలో ఏడు రోజుల పాటు శిక్షణ కొనసాగింది.

ప్రథమ చికిత్స నుంచి రక్షణ చర్యల వరకు..

శిక్షణలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటం, గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించడం, చిన్నపిల్లలు, పెద్దలకు సీపీఆర్ నిర్వహించడం, అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు.

అలాగే వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం, ప్రమాద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తాడు సహాయంతో రక్షించడం, నీటి ప్రమాదాల సమయంలో ఈత, వాటర్ రెస్క్యూ పద్ధతులు వంటి అంశాలపై సిద్ధాంతంతో పాటు ప్రాక్టికల్ శిక్షణ అందించారు.

సమాజ సేవకు యువ ఆపద మిత్రులు

విపత్తుల సమయంలో స్వీయ రక్షణ, బృంద సమన్వయం, ప్రమాద పరిస్థితులను అంచనా వేయడం, బాధితులకు తక్షణ సహాయం అందించడం వంటి అంశాలపై కూడా వాలంటీర్లకు అవగాహన కల్పించారు.

శిక్షణ పూర్తి చేసుకుని కళాశాలకు తిరిగి వచ్చిన 20 మంది వాలంటీర్లను వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి సమీరా నజ్మీన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. బి. సురేష్ కుమార్, శ్రీనివాస్, అధ్యాపక బృందం అభినందించారు.

ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ సమీరా నజ్మీన్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవ, విపత్తు నిర్వహణ, మానవతా దృక్పథంలో నైపుణ్యాలు పెంపొందించుకోవడం అభినందనీయమన్నారు. ఆపద సమయంలో ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ఉపయోగపడే ప్రథమ చికిత్స, సీపీఆర్, రక్షణ చర్యలపై శిక్షణ పొందడం సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

“సేవే లక్ష్యం.. ఆపదలో సహాయమే ధ్యేయం” అనే స్ఫూర్తితో శిక్షణ పొందిన యువ ఆపద మిత్రులు భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటారని ప్రోగ్రాం అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. అదెప్ప, శ్రీమతి అనిత, శ్రీ రవికుమార్, శ్రీ రమేష్, శ్రీ హేమంత్, శ్రీ మహేందర్ రెడ్డి, శ్రీ రాజు, శ్రీ రాము తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లు కళ్యాణ్, ప్రభాకర్, కార్తీక్, అస్మా, ప్రవల్లిక తదితరులు శిక్షణలో పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur