Narsapur: కక్షిదారులకు సత్వరమే న్యాయం అందించాలి జడ్జి ప్రవీణ్ కుమార్
Narsapur: నర్సాపూర్‌లో ప్రథమ శ్రేణి కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి గాడి ప్రవీణ్ కుమార్. కక్షిదారులకు నిష్పక్షపాతంగా సత్వర న్యాయం అందించాలని పిలుపు.
Narsapur: కక్షిదారులకు సత్వరమే న్యాయం అందించాలి జడ్జి ప్రవీణ్ కుమార్
నర్సాపూర్: కక్షిదారులకు సత్వరమే న్యాయం అందేలా న్యాయవాదులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గాడి ప్రవీణ్ కుమార్ అన్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ న్యాయ ధర్మాన్ని పాటిస్తూ, అన్యాయాన్ని సహించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోర్టు ప్రాంగణానికి చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి నూతన కోర్టును ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో మొక్క నాటి నీరు పోశారు. తదుపరి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి గాడి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కక్షిదారులకు వేగవంతమైన న్యాయం అందించడమే న్యాయవ్యవస్థ ప్రధాన లక్ష్యమన్నారు. న్యాయవాదులు తమ వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహించాలని, అన్యాయానికి తావులేకుండా చూడాలని సూచించారు. బార్ అసోసియేషన్, బెంచ్ మధ్య అన్నదమ్ముల అనుబంధం కొనసాగాలని ఆకాంక్షించారు.
న్యాయవాదులు దుస్తుల నియమావళిని పాటిస్తూ క్రమశిక్షణతో మెలగాలని, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండే గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. జీవితంలో అమ్మను మించిన గురువు ఎవరూ లేరని పేర్కొన్నారు. కక్షిదారుల సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తూ, ప్రతి ఒక్కరికీ నిష్పక్షపాతంగా న్యాయం అందేలా కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి నీలిమ మాట్లాడుతూ.. నర్సాపూర్‌లో ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టు ఏర్పాటు కావడం పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. ఇకపై న్యాయ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, స్థానికంగానే సత్వర న్యాయం పొందే అవకాశం కలుగుతుందన్నారు.
జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, కక్షిదారులు, న్యాయవాదులకు మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా తక్కువ ధరలకు భోజన సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు వివరించారు.
అనంతరం హైకోర్టు న్యాయమూర్తి గాడి ప్రవీణ్ కుమార్‌ను జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు మెమొంటో అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శుభవల్లి, సీనియర్ సివిల్ జడ్జి రూబీనా ఫాతిమా, మెదక్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి సాయి ప్రభాకర్, అల్లాదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుచరిత, నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి ఎం. హేమలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బార్ అసోసియేషన్ సభ్యులు, వివిధ ప్రాంతాల న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో నూతన కోర్టు ప్రారంభంతో పరిసర ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయి.




