Narsapur: ప్రతిపక్షాలపై పడి ఏడవడం మానండి: రేవంత్‌పై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్!

Narsapur: ప్రతిపక్షాలపై పడి ఏడవడం మానండి: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హితవు. కేసీఆర్ ఫామ్‌హౌస్ వ్యాఖ్యలు, నర్సాపూర్‌లో నిషేధిత భూములపై ప్రశ్నల వర్షం.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 23 Sept 2026 6:34 PM IST
Narsapur
X

Narsapur: ప్రతిపక్షాలపై పడి ఏడవడం మానండి: రేవంత్‌పై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్!

నర్సాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా.. పదేపదే గత ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను విమర్శించడం మానుకోవాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

గురువారం నర్సాపూర్‌లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను దూషించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు, పోలీసుల వ్యవహారశైలిపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం వ్యాఖ్యలకు క్లారిటీ ఏదీ?

కేసీఆర్ ఫామ్‌హౌస్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి 1000 ఎకరాలు, మరోసారి 65 ఎకరాలు అంటూ మాట్లాడటం సరికాదని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలని సూచించారు.

నర్సాపూర్‌లో 63 వేల ఎకరాల నిషేధిత భూములు

నర్సాపూర్ నియోజకవర్గంలో సుమారు 63 వేల ఎకరాల నిషేధిత భూములు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భూములను అమ్ముకోలేక, కొనలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే

రైతు బీమా నిలిచిపోయిందని, రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ప్రతిపక్షాల పట్ల పోలీసుల తీరుపై అభ్యంతరం

అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతల ఇళ్లకు, ఫామ్‌హౌస్‌లకు వెళ్లినప్పుడు బందోబస్తు కల్పిస్తూ.. ప్రతిపక్ష నేతల విషయంలో పోలీసులతో దాడులు చేయించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. వరంగల్ ఏఎంజీ సందర్శనకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు.

హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలను నియంత్రించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందని సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేయొద్దని ఆమె సూచించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, నాయకులు జీవన్ రెడ్డి, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR