Narsapur: నర్సాపూర్ నిరుద్యోగుల కోసం 'నిరుద్యోగ మిత్ర' యాప్

Narsapur: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 'సునీతమ్మ నిరుద్యోగ మిత్ర' యాప్ ప్రారంభం. నిరుద్యోగులకు ఇంటి నుంచే ఆన్‌లైన్ కోచింగ్.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 15 Aug 2026 8:19 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్ నిరుద్యోగుల కోసం 'నిరుద్యోగ మిత్ర' యాప్

నర్సాపూర్: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద, మధ్యతరగతి నిరుద్యోగ యువతకు ఇంటి నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం కల్పించేలా ‘సునీతమ్మ నిరుద్యోగ మిత్ర’ పేరుతో నూతన యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

తన భర్త, దివంగత లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 27 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నామని ఆమె తెలిపారు.

ప్రతి సంవత్సరం నిర్వహించే రక్తదాన కార్యక్రమానికి అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్నారని, వారికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

“రక్తదానం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుంది. నా భర్త లక్ష్మారెడ్డి ప్రజలకు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముందుగా ఎమ్మెల్యే సునీత రెడ్డి రక్త దానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తన వెంట ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు చూపిస్తున్న ఆదరణ, సహకారం వల్లే ఈ కార్యక్రమం ఇన్నేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోంది” అని ఆమె పేర్కొన్నారు.

ప్రతి ఏడాది ఓ కొత్త కార్యక్రమం.. దివంగత లక్ష్మారెడ్డి వర్ధంతి సందర్భంగా కేవలం రక్తదాన కార్యక్రమానికే పరిమితం కాకుండా, ప్రతి ఏడాది ప్రజలకు ఉపయోగపడేలా ఒక కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నామని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు.

విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్నామని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువులో ముందుకు వెళ్లేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని చదువుకోవాలని, తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారు మరింత ఉత్సాహంతో చదువుకునేలా చేయడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని వివరించారు.

నిరుద్యోగులకు ‘నిరుద్యోగ మిత్ర’గా కొత్త యాప్‌ ఇదే క్రమంలో ఈ ఏడాది నిరుద్యోగ యువత కోసం ‘సునీతమ్మ నిరుద్యోగ మిత్ర’ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని నిరుద్యోగ యువతకు చేరవేయడంతో పాటు, ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో పేద నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

“కోచింగ్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్న పేద విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడాలి. ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ తీసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగాలు సాధించాలి” అని ఆమె ఆకాంక్షించారు.

తెలుగు.. ఇంగ్లీష్‌లోనూ సేవలు ‘సునీతమ్మ నిరుద్యోగ మిత్ర’ యాప్‌ను తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఉపయోగించుకునే విధంగా రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో విడుదలయ్యే ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగ అవకాశాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

యువత తమ విద్యార్హతలకు అనుగుణంగా ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆయా ఉద్యోగాలకు ఎలా సిద్ధం కావాలి అనే అంశాలపై దృష్టి సారించి, పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా యాప్‌ ఉపయోగపడుతుందని తెలిపారు.

“ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతి యువకుడికి ఈ యాప్ ఒక మిత్రుడిలా ఉండాలి. సమాచారం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా, అవకాశాలను తెలుసుకుని ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యేలా ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలి” అని సునీత లక్ష్మారెడ్డి సూచించారు.

యువతకు ఎల్లప్పుడూ అండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు అవసరమైన మార్గదర్శకత్వం, సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు.

తన భర్త దివంగత లక్ష్మారెడ్డి ప్రజలకు చేసిన సేవలు, ఆయన ఆశయాలను కొనసాగించడమే తన లక్ష్యమని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు.

“నా భర్త లక్ష్మారెడ్డి చేసిన సేవలకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఇప్పటికీ అండగా నిలుస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో వారి సహకారం నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది. వారి ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోలేను. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను” అని ఆమె అన్నారు.

రక్తదానం నుంచి విద్యార్థుల ప్రోత్సాహం వరకు.. ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఉద్యోగ సాధనలో తోడ్పాటునందించేలా ‘నిరుద్యోగ మిత్ర’ యాప్‌ వరకు.. ప్రతి ఏడాది ఒక కొత్త కార్యక్రమంతో ప్రజలకు చేరువవుతున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఈ ఏడాది తీసుకొచ్చిన ఈ యాప్‌ ద్వారా ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ సాధనలో ఉపయోగపడుతుందో చూడాలి.

యువతకు ఉద్యోగం.. విద్యార్థులకు ప్రోత్సాహం.. ప్రజలకు సేవ — ఇదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమం లో సత్యం గౌడ్, నాగరాజు గౌడ్, నయీమ్, రింగుల ప్రసాద్, పంబాల బిక్షపతి, మహిపాల్ రెడ్డి, ఆనంద్ కుమార్,జ్ఞానేశ్వర్,చంద్ర గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గం లోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఫాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story