Narsapur: భూగర్భ జలాల పెంపొందింపే లక్ష్యం మున్సిపల్ కమిషనర్!

Narsapur: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో జరిగిన క్యాచ్ ది రైన్ సదస్సులో ఇంకుడు గుంతలు కట్టని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 22 July 2026 11:15 PM IST
Narsapur
X

Narsapur: భూగర్భ జలాల పెంపొందింపే లక్ష్యం మున్సిపల్ కమిషనర్!

నర్సాపూర్: వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "క్యాచ్ ది రైన్" కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఇంకుడు గుంతల (Rain Water Harvesting Structures) నిర్మాణంపై ప్రత్యేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ మాచునూరి లక్ష్మీరాజు యాదవ్, మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ చెరుకు సాయికుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత వర్షాకాలంలో తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేలా చేయడం అత్యంత అవసరమన్నారు. వర్షపు నీటితో పాటు ఇళ్లలో వినియోగించిన నీటిని కూడా రీచార్జ్ చేస్తే భూగర్భ జలమట్టం పెరిగి బోరుబావుల్లో తాగునీరు సమృద్ధిగా లభిస్తుందని తెలిపారు.

ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల భవిష్యత్ తరాలకు నీటి కొరత సమస్య తగ్గడంతో పాటు భూగర్భ పొరల్లో వేడి తగ్గడం, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ, వరదల తీవ్రత తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.

ప్రస్తుతం కాంక్రీట్ నిర్మాణాలు పెరగడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు తగ్గిపోయాయని పేర్కొన్న కమిషనర్, మున్సిపాలిటీ పరిధిలో 200 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భవనాలు నిర్మించిన వారు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేశామని, నిర్ణీత గడువులోగా నిర్మాణం చేపట్టని పక్షంలో తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి ఇంటా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ వనముల బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు అంతారం సుధీర్ గౌడ్, చింతకుంట శ్రీకాంత్, మున్సిపల్ మేనేజర్ వైట్ల మధుసూదన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story