Narsapur: రైతు ఉత్పత్తిదారుల సంస్థతో రైతులకు మరింత మేలు

Narsapur: రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా రైతులకు అదనపు ప్రయోజనాలు. నర్సాపూర్‌లో ఎఫ్‌పీవో సభ్యత్వ నమోదు వివరాలు వెల్లడించిన పీఏసీఎస్ సెక్రెటరీ.

G Ashok Reddy, Narsapur
Published on: 24 Sept 2026 7:21 PM IST
Narsapur
X

Narsapur: రైతు ఉత్పత్తిదారుల సంస్థతో రైతులకు మరింత మేలు

నర్సాపూర్: రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPO) ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నర్సాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) సెక్రెటరీ వెంకటస్వామి తెలిపారు. రైతులు సమూహంగా ఏర్పడి తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడంతో పాటు, వ్యవసాయ రంగంలో అందుబాటులో ఉన్న వివిధ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఈ సంస్థలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

జిల్లాలో మొత్తం 37 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, వాటిలో మెరుగ్గా పనిచేస్తున్న ఐదు పీఏసీఎస్‌లను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా ఎంపిక చేసినట్లు వెంకటస్వామి తెలిపారు. ఇందులో నర్సాపూర్, తూప్రాన్, శివంపేట, కౌడిపల్లి మండలంలోని సోమక్కపేట, హవేలీఘనపూర్ మండలంలోని ఫరీద్‌పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయని వివరించారు.

ప్రతి రైతు ఉత్పత్తిదారుల సంస్థలో 750 మంది రైతులను సభ్యులుగా చేర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒక్కో రైతు నుంచి రూ.2,000 సభ్యత్వ రుసుము తీసుకుని సభ్యత్వం కల్పిస్తున్నట్లు చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంస్థలో సభ్యులుగా చేరాలని సూచించారు.

రైతులు సమూహంగా ఏర్పడటం ద్వారా తమ వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలను పొందడంతో పాటు, ఉత్పత్తుల విక్రయం, వ్యవసాయానికి అవసరమైన వనరుల సమీకరణ తదితర అంశాల్లో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ నెల 29వ తేదీలోపు సభ్యత్వ నమోదు చేసుకోవాలని రైతులకు వెంకటస్వామి సూచించారు. సభ్యత్వం కోసం వచ్చే రైతులు పట్టా పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఫొటో తీసుకురావాలని కోరారు. నర్సాపూర్ ప్రాంతంలోని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur