Narsapur: నర్సాపూర్ మహిళ హత్య కేసు ఛేదన నిందితుడి అరెస్ట్

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును నాలుగు రోజుల్లోనే ఛేదించిన పోలీసులు. నిందితుడు కట్రోత్ సురేష్ అరెస్ట్.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 21 July 2026 7:39 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్ మహిళ హత్య కేసు ఛేదన నిందితుడి అరెస్ట్

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును మెదక్ జిల్లా పోలీసులు కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించి తమ దర్యాప్తు సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారు. సంఘటనా స్థలంలో ఎలాంటి స్పష్టమైన ఆనవాళ్లు లేకపోవడం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, సంప్రదాయ దర్యాప్తు నైపుణ్యం, సాంకేతిక విశ్లేషణ, ప్రజల సహకారంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడంలో పోలీసులు విజయవంతమయ్యారు.

మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ... ఈ నెల 17వ తేదీన నర్సాపూర్ బస్టాండ్ సమీపంలోని పొదల్లో కొల్చారం మండలం వరిగుంటం గ్రామానికి చెందిన మెట్టు షేకమ్మ (40) చేతులు కట్టబడిన స్థితిలో మృతదేహంగా కనిపించిందన్నారు. ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిందని తెలిపారు.

దర్యాప్తులో ఈ నెల 16వ తేదీ రాత్రి ఒంటరిగా ఉన్న షేకమ్మను ఐదు వందల రూపాయలు ఇస్తానని ఆశ చూపి నిందితుడు కట్రోత్ సురేష్ పొదల్లోకి తీసుకెళ్లినట్లు తేలిందన్నారు. అక్కడ ఆమె చేతులను వైర్‌తో కట్టేసి, చీరతో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అనంతరం బాధితురాలి మొబైల్ ఫోన్‌ను తీసుకుని పరారైనట్లు తెలిపారు.

ఈ కేసులో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని డీఎస్పీ వివరించారు. సంఘటనా స్థలంలో నిందితుడి ఆనవాళ్లు దాదాపు లేకపోవడం, ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దర్యాప్తు మరింత సవాలుగా మారిందన్నారు. అయినప్పటికీ పోలీసులు నిరుత్సాహపడకుండా గ్రామాల్లో సమాచార సేకరణ, అనుమానితుల కదలికలపై నిఘా, సాంకేతిక ఆధారాల విశ్లేషణ, సంప్రదాయ విచారణ పద్ధతులను సమన్వయం చేస్తూ కేసును ఛేదించారని తెలిపారు.

ఈ కేసు ఛేదనలో సామాజిక బాధ్యతతో స్పందించిన కొందరు పౌరులు అందించిన సమాచారం కీలక మలుపు తిప్పిందని డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.సామాజిక బాధ్యత గల పౌరులు అందించిన సమాచారంతో శివంపేట్ మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన కట్రోత్ సురేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి మృతురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కేసును అత్యంత వేగంగా, సమర్థవంతంగా ఛేదించిన నర్సాపూర్ సీఐ రంగా కృష్ణ, ఎస్‌ఐ రంజిత్ కుమార్ రెడ్డి, క్రైమ్ పార్టీ పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.

"ప్రతి కేసులో ప్రజల సహకారం పోలీసులకు ఎంతో కీలకం. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు అందిస్తే నేరాలను త్వరగా ఛేదించవచ్చు. బాధ్యతగల పౌరుల సహకారంతోనే సమాజాన్ని మరింత సురక్షితంగా ఉంచగలం" అని డీఎస్పీ నరేందర్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ కేసు ఛేదనతో మరోసారి "ఆధారాలు లేకపోయినా, నేరస్తుడు ఎంత తెలివిగా తప్పించుకోవాలని ప్రయత్నించినా చట్టం నుంచి తప్పించుకోలేడని" మెదక్ జిల్లా పోలీసులు చాటి చెప్పారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story