Narsapur: నర్సాపూర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు అవగాహన సదస్సు
Narsapur: నర్సాపూర్‌లో నేరాలకు చెక్ పెట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు. కౌన్సిలర్లతో ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి సమావేశం. సురక్షిత నగరంగా మార్చేందుకు పోలీసుల యత్నం.
Narsapur: నర్సాపూర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు అవగాహన సదస్సు
నర్సాపూర్: నర్సాపూర్ పట్టణంలో ఇక నేరాలకు చెక్... ప్రతి కూడలిలో సీసీ కెమెరాలే పోలీసుల కళ్లు కానున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నర్సాపూర్ పోలీసులు కీలక ముందడుగు వేశారు. పట్టణవ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు అవసరంపై మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో లో ఉన్న అందరి కౌన్సిలర్లతో నర్సాపూర్ si రంజిత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, కాలనీలు, విద్యాసంస్థలు, మార్కెట్లు, ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం నేటి పరిస్థితుల్లో అత్యవసరమని తెలిపారు.
సీసీ కెమెరాలు కేవలం నేరాలను రికార్డు చేయడానికే కాకుండా... నేరాలను ముందుగానే అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను గుర్తించడం, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ఇతర నేరాల దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించడం, ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే అవకాశాన్ని సీసీ కెమెరాలు కల్పిస్తాయని వివరించారు.
ప్రజల సహకారం లేకుండా భద్రత సాధ్యం కాదని పేర్కొంటూ... ప్రతి వార్డులో ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, అపార్ట్‌మెంట్ యాజమాన్యాలు, విద్యాసంస్థలు, ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సాంకేతికతను వినియోగించుకొని నేరరహిత, సురక్షిత నర్సాపూర్ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
"ప్రతి ఇంటికి ఒక సీసీ కెమెరా... ప్రతి వీధికి భద్రతకు భరోసా" అనే లక్ష్యంతో నర్సాపూర్‌ను స్మార్ట్, సేఫ్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ప్రజలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.




