Narsapur: నర్సాపూర్ మండల సర్వసభ్య సమావేశం.. వెల్లువెత్తిన సమస్యలు

Narsapur: నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం. గ్రామాల్లోని సమస్యలను ఏకరువు పెట్టిన సర్పంచులు.

G Ashok Reddy, Narsapur
Published on: 12 Aug 2026 12:00 AM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్ మండల సర్వసభ్య సమావేశం.. వెల్లువెత్తిన సమస్యలు

నర్సాపూర్: నర్సాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చతో సాగింది. తమ గ్రామాల్లోని సమస్యలను సర్పంచులు ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి శాఖలో ఏదో ఒక సమస్య ఉందంటూ సర్పంచులు అధికారులను ప్రశ్నించారు.

మంగళవారం నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో భారతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. తొలుత వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, ప్రగతిని వివరించారు. అనంతరం సర్పంచులు గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.

రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలి

ఎల్లారెడ్డిగూడ సర్పంచ్ బిక్యా నాయక్ మాట్లాడుతూ తమ గ్రామంలో రేషన్ దుకాణం లేకపోవడంతో ప్రజలు పక్క గ్రామానికి వెళ్లి రేషన్ తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. గ్రామంలోనే రేషన్ దుకాణం ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఎమ్మెల్యేను కోరారు.

వీధి దీపాల బిల్లులపై ఆందోళన

నత్నయపల్లి సర్పంచ్ ఉదయ్ మాట్లాడుతూ గ్రామాల్లో వీధి దీపాల విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయని, రైస్ మిల్ బిల్లులను తలపించే స్థాయిలో బిల్లులు రావడంతో వాటిని చెల్లించడం గ్రామపంచాయతీలకు భారంగా మారిందని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ఆశా, ఏఎన్ఎంల సేవలపై ప్రశ్నలు

అహ్మద్‌నగర్ సర్పంచ్ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల విధులు, సేవలపై స్పష్టత లేకుండా ఉందని సభ దృష్టికి తీసుకువచ్చారు. వారు గ్రామాలకు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో కూడా ప్రజలకు తెలియడం లేదని పేర్కొన్నారు. గ్రామాల్లో వైద్య సేవలు సక్రమంగా అందేలా పర్యవేక్షణ పెంచాలని కోరారు.

రేషన్ బియ్యం, యూరియా యాప్‌పై సమస్యలు

కొన్ని గ్రామాల్లో రేషన్ బియ్యం ఇంకా అందలేదని పలువురు సర్పంచులు తెలిపారు. అదేవిధంగా రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా యాప్ సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మహిళా భవనాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు, గ్రామాల్లో మౌలిక వసతులు తదితర అంశాలపై కూడా సర్పంచులు సమస్యలను ప్రస్తావించారు.

గ్రామాల వారీగా సర్పంచులు సమస్యలను వివరించడంతో సమావేశం సమస్యల చిట్టాతో సాగింది. ప్రజలకు నేరుగా సంబంధించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సర్పంచులు కోరారు.

అనంతరం ఆయా శాఖల అధికారులు స్పందిస్తూ సర్పంచులు ప్రస్తావించిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ మహమ్మద్ మోజాం హుస్సేన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఫాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story