Medak: ఎండిపోతున్న వరి పంటలు.. విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన!

Medak: మెదక్ జిల్లాలో విద్యుత్ కోతలు, లోఓల్టేజీ సమస్యల కారణంగా ఎండిపోతున్న వరి పంటలు. వ్యవసాయానికి 12 గంటల నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు.

NAGARAJ, MEDAK
Published on: 12 Oct 2026 3:25 PM IST
Medak
X

Medak: ఎండిపోతున్న వరి పంటలు.. విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన!

Medak: ఒకవైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు మండుతున్న ఎండలు.. ఇంకోవైపు విద్యుత్‌ కోతలు, లోఓల్టేజీ సమస్యలు.. వెరసి మెదక్‌ జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బోర్లపై ఆధారపడి వరి సాగు చేసిన రైతులకు విద్యుత్‌ కోతలు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.

చేతికొచ్చే దశలో ఉన్న పంటలకు చివరి తడులు అందకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందనే భయం రైతులను వెంటాడుతోంది. పంటను కాపాడుకునేందుకు పొలాల వద్దే పడిగాపులు కాస్తున్నా విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో చేసేదేమీ లేక రైతులు ఆవేదన చెందుతున్నారు.మెదక్‌ జిల్లాలోని 21 మండలాల పరిధిలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. వర్షాకాలం ప్రారంభం నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగునీటి అవసరాల కోసం రైతులు బోర్లపై ఆధారపడాల్సి వచ్చింది.

జిల్లాలో దాదాపు 2,99,577 ఎకరాల్లో దొడ్డు, సన్నరకం వరి సాగు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పంట కీలక దశకు చేరుకోవడంతో నీటి అవసరం మరింత పెరిగింది. ఈ సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం రైతులకు సమస్యగా మారింది.వరి పంటకు చివరి తడులు అందితేనే ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు.

అయితే వ్యవసాయానికి కేటాయించిన సమయంలోనూ విద్యుత్‌ సరఫరా సక్రమంగా ఉండటం లేదని, మధ్యమధ్యలో కోతలు విధించడంతో మోటార్లు పనిచేయడం లేదని వాపోతున్నారు. లోఓల్టేజీ కారణంగా మోటార్లు ఆన్‌ కాకపోవడం, పనిచేసినా పొలాలకు సరిపడా నీరు అందకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.

వ్యవసాయానికి కనీసం ఎనిమిది గంటల విద్యుత్‌ కూడా సక్రమంగా అందడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సరఫరా సమయాల్లోనూ తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎల్‌సీ (లోకల్‌ కటింగ్‌) పేరుతో, సబ్‌స్టేషన్ల నిర్వహణ కారణంగా విద్యుత్‌ నిలిపివేస్తుండటంతో సాగునీరు అందించలేకపోతున్నామని చెబుతున్నారు.

పంటకు నీరు అవసరమైన సమయంలో విద్యుత్‌ లేకపోవడం తమకు పెద్ద సమస్యగా మారిందని రైతులు అంటున్నారు. పంట సాగు కోసం ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులతో అప్పులు చేశామని, ఇప్పుడు పంట ఎండిపోతే పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదని ఆందోళన చెందుతున్నారు.

చివరి దశలో ఉన్న వరి పంటను కాపాడాలంటే కనీసం 12 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.కొల్చారం, కౌడిపల్లి, నిజాంపేట, రామాయంపేట, అల్లాదుర్గం, మెదక్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో విద్యుత్‌ కోతల కారణంగా వరి పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. వర్షాలు సరిగా కురవకపోవడం, బోర్లపై ఆధారపడాల్సి రావడం, ఇప్పుడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని పేర్కొంటున్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK