Sangareddy: సంగారెడ్డిలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ నివాళులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Oct 2026 12:23 PM IST
Sangareddy
X

Sangareddy: సంగారెడ్డిలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం!

Sangareddy: ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తూ, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్తూపం వద్ద అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ., విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు పోలీస్ అమరవీరులు సిర్గాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన జంగయ్య, సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎల్లయ్య, జిన్నారం పోలీస్ స్టేషన్‌కు చెందిన సత్యనారాయణ, కంగ్టి పోలీస్ స్టేషన్‌కు చెందిన సురేష్ చేసిన సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ., 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పది మంది భారత పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించగలుగుతున్నామని ఎస్పీ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రాంతంలో గతంలో నక్సలిజం ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ఎంతో మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు పోలీస్ అమరవీరులు ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. సిర్గాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన జంగయ్య, సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎల్లయ్య, జిన్నారం పోలీస్ స్టేషన్‌కు చెందిన సత్యనారాయణ, కంగ్టి పోలీస్ స్టేషన్‌కు చెందిన సురేష్ చేసిన సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

2025 సెప్టెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 154 మంది పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు పోలీసు సిబ్బంది ఉన్నారని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, దేశ అంతర్గత భద్రత, ప్రభుత్వ ఆస్తుల రక్షణతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని కల్పించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని ఎస్పీ తెలిపారు. అమరవీరుల త్యాగాలు ప్రతి పోలీసు అధికారి, సిబ్బందికి స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నుంచి అక్టోబర్ 31న నిర్వహించే సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవం వరకు ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేస్తూ, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యం. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల రక్షణకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి అని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్