Narsapur: దుర్గామాత మండపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: పోలీసులు
Narsapur: దుర్గామాత నవరాత్రుల మండపాల ఏర్పాటుకు 100 శాతం ఆన్లైన్ అనుమతి తప్పనిసరి అని నర్సాపూర్ ఎస్హెచ్ఓ ఏ. రంజిత్ కుమార్ స్పష్టం చేస్తూ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
Narsapur: దుర్గామాత మండపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: పోలీసులు
నర్సాపూర్, మెదక్ జిల్లా: దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పందిళ్ల ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న నిర్వాహకులకు నర్సాపూర్ పోలీసులు కీలక సూచనలు చేశారు. నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి మండపాలు ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగా ఆన్లైన్ అనుమతి పొందాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏ. రంజిత్ కుమార్ స్పష్టం చేశారు.
దుర్గామాత మండపాలు ఏర్పాటుకు సంబంధించిన Durga Mata Pandal Application ప్రస్తుతం అందుబాటులో ఉందని పోలీసులు తెలిపారు. పండాల్ నిర్వాహకులు policeportal.tspolice.gov.in వెబ్సైట్లోకి వెళ్లి మండపాలు ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల వివరాలు, సంప్రదింపు నంబర్లు తదితర పూర్తి సమాచారాన్ని నమోదు చేసి అనుమతి ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
నిబంధనలు పాటించాల్సిందే..
మండపాల ఏర్పాటు విషయంలో నిర్వాహకులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా రోడ్లు, ప్రధాన కూడళ్లు, ఫుట్‌పాత్‌లు, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు.
మండపాలా వద్ద విద్యుత్ భద్రత, అగ్ని ప్రమాద నివారణ చర్యలు, అత్యవసర సమయంలో బయటకు వెళ్లేందుకు మార్గాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే భక్తులు, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.
సౌండ్ సిస్టమ్‌పై ఆంక్షలు..
మండపాలా వద్ద లౌడ్స్పీకర్లు, సౌండ్ సిస్టమ్ వినియోగించే సమయంలో అనుమతించిన పరిమితులను దాటకూడదని పోలీసులు హెచ్చరించారు. అమలులో ఉన్న శబ్ద నియంత్రణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా అసభ్యకరమైన, వివాదాస్పదమైన లేదా ఇతరుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు, బ్యానర్లు, ప్రదర్శనలకు తావివ్వకూడదని సూచించారు. మంటపాలా వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలకు అవకాశం ఇవ్వొద్దని నిర్వాహకులకు సూచించారు.
100 శాతం ఆన్లైన్ నమోదు చేయాలి
నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయబోయే ప్రతి దుర్గామాత మంటపాలా వివరాలను 100 శాతం ఆన్లైన్లో నమోదు చేసి, ముందస్తు అనుమతులు పొందేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని SHO ఏ. రంజిత్ కుమార్ కోరారు.
ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా జరిగేలా పోలీసులకు, ఇతర సంబంధిత శాఖలకు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని తెలిపారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని నర్సాపూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.




