Medak: రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం: మెదక్‌లో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్
Medak: మెదక్ జిల్లాలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కీలక సమావేశం. వానకాలం సీజన్‌కు సిద్ధంగా ఉన్న విత్తనాలు, జిల్లాలో 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా.
Medak: రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం: మెదక్‌లో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్
మెదక్: రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఎఫ్‌పీఓలు ఏఆర్‌ఎస్‌కే కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై, వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతుందని చైర్మన్ తెలిపారు. సేకరించిన విత్తనాలను కఠినమైన ప్రమాణ పరీక్షల అనంతరం ధృవీకరించి మాత్రమే రైతులకు అందజేస్తున్నామని అన్నారు. దీనివల్ల రైతులకు నాణ్యతపై పూర్తి భరోసా ఉంటుందని వివరించారు.వానకాలం సీజన్‌కు విత్తనాలు సిద్ధం. ప్రస్తుత వానకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి జిల్లాలో విత్తనాల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. సన్న రకాలు: బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కెఎన్‌ఎం 1638. దొడ్డు రకాలు: కెఎన్‌ఎం 118, ఎమ్‌టియు 1010.
పై రకాల విత్తనాలు నిల్వలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము విత్తనాలను కూడా సకాలంలో రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు.
సహకార సంఘాల పాత్రపై సూచనలు
సహకార సంఘాలు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాలు కేవలం రాయితీ ఉన్న పచ్చిరొట్ట విత్తనాలపైనే కాకుండా, ఇతర పంటల విత్తనాలను కూడా రైతులకు అందించడంలో చొరవ చూపాలని కోరారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తులను తప్పనిసరిగా విక్రయించాలని సూచించారు.
మెదక్ జిల్లా సాగు అంచనాలు
మెదక్ జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నామని, అందుకు 82 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 40 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా రైతుల హక్కులతో పాటు, డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విత్తనాలను రైతులు కొనుగోలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నిత్యానంద్ , జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పి ప్రభాకర్ రెడ్డి ఏడీఏలు, ఎంఏఓలు, జిల్లా సహకార అధికారి (DCO), విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు మరియు ఎఫ్‌పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.




