Sangareddy: సుల్తాన్‌పూర్ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం - నేషనల్ హైవేపై బైఠాయింపు!
Sangareddy: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్, విద్యార్థిపై దాడి. NH-161పై బైఠాయించి బాధితుడి తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన.
Sangareddy: సుల్తాన్‌పూర్ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం - నేషనల్ హైవేపై బైఠాయింపు!
Sangareddy: జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు తమను ర్యాగింగ్ చేసి, రెండో సంవత్సరం ట్రిపుల్ ఈ విద్యార్థి పై దాడి చేశారంటూ జూనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారి 161పై బైఠాయించి ఆందోళన బాట పట్టారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు, బాధితుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. EEE సెకండ్ ఇయర్ చదువుతున్న రుత్విక్‌ను కొందరు సీనియర్లు ర్యాగింగ్ చేశారంటూ తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ర్యాగింగ్ అనంతరం రుత్విక్‌పై దాడి జరగడంతో గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం రుత్విక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీనియర్ల దాడిపై కాలేజీ ప్రిన్సిపల్‌కు జూనియర్ లు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రిన్సిపల్ విశ్వనాధ్ రాజ్ స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు జాతీయ రహదారిపై ఆందోళన బాట పట్టారు. రుత్విక్ తల్లిదండ్రులతో కలిసి NH-161పై బైఠాయించి ధర్నా చేపట్టారు.
విద్యార్థుల ఆందోళనతో జోగిపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునీ ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు డిమాండ్ చేశారు. ర్యాగింగ్ ఘటనపై కాలేజీ యాజమాన్యం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




