Narsapur: రాయరావు చెరువు నీటిపై ప్రైవేట్ రిసార్ట్ కన్ను

Narsapur: నర్సాపూర్ మున్సిపాలిటీ రాయరావు చెరువు నుంచి అలంకార రిసార్ట్ అక్రమంగా నీటిని తోడుతుండటంతో అధికారులు మోటార్లు సీజ్ చేసి, పోలీసులకు ఫిర్యాదుకు సిద్ధమయ్యారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 5 Nov 2026 7:20 PM IST
Narsapur
X

Narsapur: రాయరావు చెరువు నీటిపై ప్రైవేట్ రిసార్ట్ కన్ను

నర్సాపూర్: రైతుల పంటలు నీళ్లు లేక ఎండిపోతుంటే.. ప్రైవేట్ రిసార్ట్ అవసరాల కోసం మాత్రం చెరువు నీటిని తోడుకుంటున్నారా? ప్రజా అవసరాలకు, వ్యవసాయానికి ఉపయోగపడాల్సిన రాయరావు చెరువు నీటిపై ప్రైవేట్ రిసార్ట్ యాజమాన్యం కన్ను పడిందనే ఆరోపణలు నర్సాపూర్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాయరావు చెరువు నుంచి అలంకార రిసార్ట్ యాజమాన్యం అక్రమంగా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడుకుంటోందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ఒకవైపు రాయరావు చెరువు కింద సాగు చేస్తున్న రైతులు నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చెరువు నుంచి సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరితే.. జిల్లా అధికారుల అనుమతులు లేవని, నీటిని విడుదల చేయలేమని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో నీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయే దశకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది.

*రైతులకు నీళ్లు లేవు.. రిసార్ట్‌కు మాత్రం చెరువు నీళ్లు ఎలా?*

రైతులకు సాగునీరు అందించేందుకు అనుమతులు లేవంటున్న అధికారులు.. అదే చెరువు నుంచి ప్రైవేట్ రిసార్ట్‌కు నీటి తరలింపు జరుగుతున్న ఆరోపణలపై ఏం సమాధానం చెబుతారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా వినిపిస్తున్నాయి. రైతుల పంటలను కాపాడలేని పరిస్థితి ఉంటే, ప్రైవేట్ రిసార్ట్ అవసరాల కోసం చెరువు నీటిని వినియోగించుకోవడానికి ఎవరు అనుమతిచ్చారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సంపాదనే ధ్యేయంగా ప్రజా వనరులను ప్రైవేట్ అవసరాలకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు ప్రజల ఆస్తులని, వాటి నీటిపై ప్రైవేట్ సంస్థలకు ఇష్టానుసారంగా హక్కులు ఉండవని స్పష్టం చేస్తున్నారు.

*అధికారుల కొరడా.. మోటార్లు సీజ్!*

ఈ వ్యవహారంపై స్పందించిన మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు అక్రమంగా ఏర్పాటు చేసిన మోటార్లను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రేపు ఉదయం పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

*అధికారుల నిర్లక్ష్యానికి బాధ్యులెవరు?*

అసలు రిసార్ట్‌కు చెరువు నీటిని వినియోగించుకునేందుకు అనుమతులు ఉన్నాయా? జిల్లా అధికారుల అనుమతి లేకుండా నీటిని తోడుకుంటున్నట్లయితే ఇంతకాలం సంబంధిత శాఖల పర్యవేక్షణ ఎక్కడుంది? రైతులకు సాగునీరు అందించలేమని చెప్పిన అధికారులు ప్రైవేట్ రిసార్ట్ నీటి వినియోగంపై ఎందుకు స్పందించాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

కేవలం మోటార్లు సీజ్ చేయడంతో సరిపెట్టకుండా, చెరువు నీటి వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే రిసార్ట్ యాజమాన్యంపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

*ఒకవైపు రైతుల పంటలు ఎండిపోతుంటే.. మరోవైపు ప్రైవేట్ అవసరాలకు చెరువు నీటి వినియోగం జరుగుతోందనే ఆరోపణలు రావడం అధికారుల పనితీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.*

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రాయరావు చెరువు నీటి వినియోగంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి. రైతులకు సాగునీటి విషయంలో న్యాయం చేయడంతో పాటు ప్రజా వనరులను కాపాడాలి. అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతుల పంటలకు నీళ్లు ఇవ్వడానికి అనుమతులు లేవంటున్న అధికారులు.. ప్రైవేట్ రిసార్ట్‌కు చెరువు నీరు తరలిస్తున్నారనే ఆరోపణలపై ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR