Jogipet: జోగిపేటలో బియ్యం చోరీ: దొంగతనమా? అక్రమ దందానా?

Jogipet: జోగిపేటలో గోడకు కన్నం వేసి 40 బస్తాల బియ్యం చోరీకి గురైన ఘటనలో అసలు దొంగతనమా లేక రేషన్ బియ్యం దందాను కప్పిపుచ్చే నాటకమా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

UMASHANKAR, ANDOLE
Published on: 24 Oct 2026 4:12 PM IST
Jogipet
X

Jogipet: జోగిపేటలో బియ్యం చోరీ: దొంగతనమా? అక్రమ దందానా?

జోగిపేట: జోగిపేట ​పట్టణంలో దసరా పండుగకు సరిగ్గా ఒక్క రోజు ముందు రాత్రి జరిగిన ఒక భారీ దొంగతనం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సాధారణంగా దొంగలు ఇళ్లలో నగలు, నగదు చోరీ చేయడం చూస్తుంటాం. కానీ, ఏకంగా ఒక బియ్యం దుకాణాన్ని టార్గెట్ చేసి, వెనుక గోడకు పెద్ద రంధ్రం చేసి 40 బస్తాల బియ్యాన్ని ఎత్తుకెళ్లడం ఇప్పుడు అనేక అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తోంది. కేవలం దొంగతనం కోణంలోనే సాగుతున్న ఈ విచారణ అసలు కథను పక్కదారి పట్టిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.​

​దసరా పండుగ హడావుడిలో జనం ఉంటే, దుండగులు మాత్రం తమ పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. జోగిపేటలోని బాలాజీ హాస్పిటల్ ఎదుట గల ఒక బియ్యం దుకాణాన్ని ఎంచుకున్న దొంగలు, ఎవరికీ అనుమానం రాకుండా దుకాణం వెనుక వైపు ఉన్న గోడను పగులగొట్టి పెద్ద రంధ్రం చేశారు. ఆ రంధ్రం గుండా లోపలికి ప్రవేశించి, సుమారు 40 బియ్యం బస్తాలను రాత్రికి రాత్రే గుట్టుగా తరలించిపోయారు. తెల్లవారి షటర్ తెరిచి చూసిన దుకాణదారుడు కంగుతిని, వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.​

​ఈ దొంగతనం ఫిర్యాదు నమోదు కావడంతోనే అసలు కథ మొదలైంది. పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఈ ఘటనలో వెలుగు చూస్తున్న కొన్ని ప్రశ్నలు మాత్రం మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలుగా మారాయి.

​లైసెన్స్ ఎక్కడ? అనుమతులు ఏంటి?

పట్టణంలో బహిరంగంగా బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్న ఆ దుకాణదారునికి అసలు ఏ రకమైన లైసెన్స్ ఉంది? పౌర సరఫరాల శాఖ నుంచి నిబంధనల ప్రకారం అనుమతి తీసుకున్నారా? లేక ఎలాంటి అనుమతి లేకుండానే ఈ దందా నడుస్తోందా?

​ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు?

దుకాణంలో నిల్వ ఉంచిన ఆ బియ్యం బస్తాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మిల్లుల నుంచా? లేక బహిరంగ మార్కెట్ నుంచా? అనే విషయంలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఈ బియ్యానికి సంబంధించిన కొనుగోలు బిల్లులు దుకాణదారుడి వద్ద ఉన్నాయా?

​అవి పీడీఎస్‌ బియ్యమేనా? అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రేషన్ దుకాణాల ద్వారా అందించే పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా జోగిపేట పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతుందనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై గతంలో ఇదే దుకాణం సహా పట్టణంలోని పలు దుకాణాల్లో విజిలెన్స్ దాఫులు జరిగిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చోరీకి గురైన ఆ 40 బస్తాలు కూడా అవేనా? కాదా? ఒకవేళ కాకపోతే దానికి రుజువుగా పక్కా ఆధారాలు చూపించగలరా? ఈ కోణంలో ఇంతవరకు పోలీసులు ఎలాంటి ఆరా తీయకపోవడం గమనార్హం.

​ తెరవెనుక 'మధ్యవర్తి' కథ

​ఈ కేసులో దొంగతనం ఫిర్యాదు ఒక ఎత్తు అయితే, తెరవెనుక నడుస్తున్న తతంగం మరో ఎత్తుగా ఉంది. బాధితుడిగా ముందుకు వచ్చిన ఆ దుకాణదారుడికి, పోలీసులకు మధ్య ఒక 'మధ్యవర్తి' కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

​అసలు ఈ మధ్యవర్తికి, పోలీసులకు సంబంధం ఏమిటి?

​కేసు దర్యాప్తు చేయాల్సిన పోలీసులు నేరుగా బాధితుడితో మాట్లాడకుండా, ఈ మధ్యవర్తి ద్వారానే ఎందుకు వ్యవహరిస్తున్నారు?

​వ్యాపారి వద్ద ఉన్న లెక్కలు, లైసెన్స్‌ల గురించి ప్రశ్నించాల్సిన చోట, ఈ మధ్యవర్తి ఎంటరై వ్యవహారాన్ని వేరే దారికి మళ్లిస్తున్నారనే గుసగుసలు జోగిపేట వ్యాపార వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.

​దొంగతనంపైనే ఫోకస్‌ తప్ప అసలు కోణంపై దృష్టి లేదు

​ఇప్పుడు అందరి దృష్టి కేవలం 'బియ్యం దొంగలించారు' అనే వార్త పైనే ఉంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. తప్ప బియ్యం ఎక్కడివి? ఎవరివి? వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయి? అనే కీలకమైన అంశంపై మాత్రం దృష్టి సారించకపోవడం గమనార్హం. పోలీసులు ఈ కోణాన్ని కావాలనే విస్మరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

​ఒకవేళ ఆ బియ్యం గనుక రేషన్ బియ్యం అయి ఉంటే, దొంగతనానికి గురయ్యాయని ఫిర్యాదు చేయడం ద్వారా వాటికి లెక్క చూపించే ప్రయత్నం జరుగుతోందా? లేక అక్రమ దందాను బయటపడకుండా కప్పి పుచ్చుకునే ఎత్తుగడనా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

​సంబంధిత శాఖల అధికారులు, పోలీసులు కేవలం దొంగల వేటతో సరిపెట్టకుండా... ఆ దుకాణంలో అసలు ఏం వ్యాపారం జరుగుతోంది? ఆ 40 బస్తాల బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణంలో సమగ్ర విచారణ జరిపితేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు, కోరుతున్నారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE