Andole: నిధులు మంజూరైనా మారని జోగిపేట చింతకుంట రోడ్డు దుస్థితి!
Andole: అందోల్ నియోజకవర్గంలో రోడ్లకు రూ. 338 కోట్ల నిధులు మంజూరైనా అడుగంటిన ఆశలు. జోగిపేట - చింతకుంట రహదారిపై గుంతలతో వాహనదారుల నరకయాతన!
Andole: నిధులు మంజూరైనా మారని జోగిపేట చింతకుంట రోడ్డు దుస్థితి!
Andole: అందోల్ నియోజకవర్గ పరిధిలోని రోడ్ల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ఏకంగా రూ. 338.63 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలోని ప్రధాన రహదారులన్నీ అద్దంలా మారుతాయని ప్రజలు ఆశించారు. కానీ, అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల ఉదాసీనత వల్ల ఆ ఆశలన్నీ అడుగంటాయి.
ముఖ్యంగా జోగిపేట నుండి చింతకుంట వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం నరకానికి నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం 4.20 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు మరమ్మతుల కోసం రూ. 4.86 లక్షలు కేటాయించినట్లు అధికారులు కాగితాల్లో చూపిస్తున్నారు. కానీ నిధులు మంజూరై ఆరు నెలలు దాటినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్క గుంత కూడా పూడ్చిన పాపాన పోలేదు."
ఈ రహదారి పొడవునా ప్రమాదకరమైన మూల మలుపులు ఉన్నాయి. దానికి తోడు రోడ్డుపై భారీ గుంతలు పడటంతో వాహనదారులు నిత్యం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో ఈ దారిలో ప్రయాణించాలంటేనే ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు వణికిపోతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చిన్న పెద్ద ప్రమాదాలు జరిగి అనేకమంది ఆసుపత్రుల పాలయ్యారు. నిధులు ఉండి, ప్రణాళికలు ఉండి కూడా ఐదు నెలలుగా పనులు ప్రారంభించకపోవడం వెనుక ఉన్న అసలు కారణమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు."
భారీ నిధుల ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి, జోగిపేట - చింతకుంట ప్రధాన రహదారి పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని, వాహనదారుల నరకయాతనకు చరమగీతం పాడాలని అందోల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




