Medak: అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. కలెక్టర్!

Medak: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందుతుందని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ కౌడిపల్లిలో తెలిపారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 23 Nov 2026 3:10 PM IST
Medak
X

Medak: అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. కలెక్టర్!

Medak: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా లబ్ధి చేకూర్చేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.

సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను, జలసిరి పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, నమోదు విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కుటుంబంలోని 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల వ్యక్తిని బీమా పొందే వ్యక్తిగా ప్రతిపాదించాలని సూచించారు.

దరఖాస్తు చేసుకునే వ్యక్తి స్వయంగా ఫారంపై సంతకం చేసి, నామినీ వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. దరఖాస్తులను ఎలాంటి తప్పులు లేకుండా పూరించి అధికారులకు అందించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో సైతం ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా నామినీ ఎంపిక విషయంలో లబ్ధిదారుల నుంచి ప్రత్యక్షంగా సంతకాలు తీసుకోవాలని, అర్హులైన కుటుంబాలకు పథకం అందేలా పారదర్శకంగా నమోదు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. దరఖాస్తుల సమర్పణకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR