Sangareddy: ధాన్యం కొనుగోలు కాక మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన రైతు మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేశాడు.

G Ashok Reddy, Narsapur
Published on: 3 Jun 2026 12:58 PM IST
Sangareddy
X

Sangareddy: ధాన్యం కొనుగోలు కాక మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం!

సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలంలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. హత్నూర మండల పరిధిలోని మంగాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతు తన పొలంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి 28 రోజులు గడిచినా కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఏర్పడటంతో మరింత మనస్తాపానికి లోనయ్యాడు.

ఈ నేపథ్యంలో దౌల్తాబాద్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకున్న మల్లేష్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్న స్థానికులు అప్రమత్తమై వెంటనే అతడిని అడ్డుకుని ప్రమాదాన్ని నివారించారు. అనంతరం రైతు మాట్లాడుతూ తాను ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న అధికారులు, స్థానిక నాయకులు కొనుగోలు కేంద్రానికి చేరుకుని రైతును ఓదార్చి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story