Sangareddy: జోగిపేటలో బరితెగించిన ఇసుక మాఫియా: పట్టించుకోని అధికారులు!
Sangareddy: జోగిపేట శివారు ప్రధాన రహదారిపై యథేచ్ఛగా ఇసుక అక్రమ విక్రయాలు సాగుతున్నా మైనింగ్, పంచాయతీ అధికారులు స్పందించడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Sangareddy: జోగిపేటలో బరితెగించిన ఇసుక మాఫియా: పట్టించుకోని అధికారులు!
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణ శివారు ప్రధాన రహదారిపై సాగుతున్న ఇసుక అక్రమ విక్రయాలపై పత్రికల్లో, మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారుల చర్యలు శూన్యంగానే మిగిలాయి. రోడ్డు పక్కన భారీగా ఇసుక కుప్పలు పోసి బహిరంగంగానే దందా సాగిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు వస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రమాదాలు జరుగుతున్నా పట్టదా?
జోగిపేట శివారు రోడ్డుపై ఇసుక నిల్వల వల్ల నిత్యం ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడుతున్నారు. చీకటి పడితే ఈ ఇసుక దిబ్బలు కనిపించక వాహనాలు జారి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇక రహదారి గుండా భారీ వాహనాలు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి పైకి లేస్తోంది. కళ్ళల్లో ఇసుక రేణువులు పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా, కంటి ముందే అక్రమ వ్యాపారం సాగుతున్నా మైనింగ్ అధికారులు గానీ, గ్రామ పంచాయతీ, పోలీస్ సిబ్బంది గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. కేవలం మామూళ్ల మత్తులోనే అధికారులు ఈ అక్రమ దందాను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని వాహనదారులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
మరింత బరితెగించిన అక్రమార్కులు!
తమపై ఎలాంటి చర్యలు ఉండవనే ధీమాతో ఇసుక మాఫియా మరింతగా బరితెగిస్తోంది. రాత్రి వేళల్లో స్థానిక వాగుల నుండి ట్రాక్టర్లు,లారీల ద్వారా యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూ, అన్నసాగర్ - జోగిపేట ప్రధాన రహదారిని ఇసుక అడ్డాగా మార్చేస్తున్నారు. పత్రికల్లో వార్త వచ్చినా అధికారులు స్పందించకపోవడంతో అక్రమార్కులకు మరింత బలం చేకూరినట్లయిందని, రోడ్డుపై ఇసుక కుప్పల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నత అధికారులు స్పందించాలి..
ఇప్పటికైనా స్థానిక అధికారులు నిద్రమత్తు వీడి జోగిపేట శివారులో ప్రమాదకరంగా మారిన ఇసుక కుప్పలను తక్షణమే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి, అక్రమ విక్రయాలు జరుపుతున్న వారిపై మరియు వారికి సహకరిస్తున్న స్థానిక అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జోగిపేట పట్టణ ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.




