Sangareddy: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేతలు మంత్రికి వినతిపత్రం అందజేశారు.

Srinivas K, Sangareddy
Published on: 28 Oct 2026 9:54 AM IST
Sangareddy
X

Sangareddy: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఉన్న అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇంటి స్థలాలను మంజూరు చేయాలని రాష్ట్ర రెవిన్యూ ,హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని టియుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా శాఖ కోరింది. సంగారెడ్డిలోని జిల్లా పరిషత్తు లో మంగళవారం మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం టియుడబ్ల్యూజేఐజేయు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో సంఘ నేతలు మంత్రికి వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్నదని, ఇప్పటివరకు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించలేదని ఈ సందర్భంగా బండారు యాదగిరి పేర్కొన్నారు. తక్షణమే అర్హులైన వారి జాబితాన్ని సేకరించి, ఇంటి స్థలాలను మంజూరు చేయాలని కోరారు. అంతేకాకుండా హెల్త్ కార్డులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా నగదు రహిత వైద్య సేవలను జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు అందే విధంగా చూడాలని పేర్కొన్నారు.

హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల..పేద జర్నలిస్టులు, వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ,హెల్త్ కార్డును ఇవ్వక పోవడం సమంజసం కాదని అన్నారు. దీనివల్ల జర్నలిస్టుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని బండారు యాదగిరి వివరించారు. ఇంకా అనేకమంది అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందలేదని వారికి కూడా అక్రిడేషన్ కార్డులను అందించాలని మంత్రికి మూడో డిమాండ్ గా విన్నవించారు.

దీంతో మంత్రి వెంటనే స్పందించారు. హైదరాబాద్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలను త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో అర్హులందరికీ ఇంటి స్థలాలను కచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో నిశ్చింతగా ఉండాలని మంత్రి పొంగులేటి తెలిపారు. జిల్లాకు చెందిన మంత్రి రాజనర్సింహ కూడా సానుకూలంగా స్పందించారు. సంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల సమస్యలను మంత్రి పొంగిలేటికి సంక్షిప్తంగా వివరించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా వేదికపై ఉన్నారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేఐజేయు నాయకులు రాజు నాయక్, హెచ్ఎంటీవీ శ్రీనివాస్, బాలయ్య, శ్రీకాంత్, ఫోటో జర్నలిస్టుల సంఘ అధ్యక్షుడు ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు.

Srinivas K, Sangareddy

Srinivas K, Sangareddy