Sangareddy: పాలపిట్టను బంధించిన నేరేడిగుంట సర్పంచ్.. కేసు నమోదుకు డిమాండ్

Sangareddy: సంగారెడ్డి జిల్లా నేరేడిగుంట సర్పంచ్ ఒగ్గు సాయి కిరణ్ పాలపిట్టను పంజరంలో బంధించి వైల్డ్‌లైఫ్ యాక్ట్ ఉల్లంఘన. సర్పంచ్‌పై కఠిన చర్యలకు డిమాండ్.

UMASHANKAR, ANDOLE
Published on: 21 Oct 2026 10:44 PM IST
Sangareddy
X

Sangareddy: పాలపిట్టను బంధించిన నేరేడిగుంట సర్పంచ్.. కేసు నమోదుకు డిమాండ్

సంగారెడ్డి: చట్టాలు చెప్తున్నా వినలేదు.. పోలీసులు హెచ్చరిస్తున్నా లెక్కచేయలేదు! దసరా నాడు పాలపిట్టను చూడాలనే మూఢనమ్మకమో.. లేక ప్రజాప్రతినిధిని అనే అహంకారమో తెలీదు కానీ, వన్యప్రాణి చట్టాన్ని నిలువునా ఉల్లంఘించారు. సంగారెడ్డి జిల్లా నేరేడిగుంట సర్పంచ్ ఒగ్గు సాయి కిరణ్ ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పాలపిట్టను బంధిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్, అటవీ శాఖ అధికారులు ఎంత మొత్తుకున్నా లెక్కచేయకుండా.. దసరా రోజున పాలపిట్టను బంధించి, ప్రజల ముందుకు తెచ్చి వదిలేశారు.

తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట సంరక్షణ కోసం ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. దసరా పండుగ వేళ పాలపిట్టలను బంధించి ప్రదర్శించడం చట్టరీత్యా నేరమని, వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అధికారులు ముందే హెచ్చరించారు. కానీ, నేరేడిగుంట సర్పంచ్ సాయి కిరణ్ మాత్రం ఆ హెచ్చరికలను బేఖాతరు చేశారు. పాలపిట్టను ఒక పంజరంలో బంధించి.. దసరా ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులందరి ముందుకు తీసుకువచ్చి దాన్ని గాల్లోకి వదిలిపెట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చట్టాన్ని గౌరవించాల్సిన సర్పంచే ఇలాంటి పనికి ఒడిగట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించిన సర్పంచ్ ఒగ్గు సాయి కిరణ్‌పై అటవీ శాఖ, పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

సాంప్రదాయాల పేరుతో నోరు లేని జీవులను హింసించడం ఎంతవరకు సమంజసం? అధికారులు హెచ్చరించినా లెక్కచేయని ఇలాంటి ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని వన్యప్రాణి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

UMASHANKAR, ANDOLE

UMASHANKAR, ANDOLE