Sangareddy: సంగారెడ్డిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీ!
Sangareddy: సంగారెడ్డిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినదించారు.
Sangareddy: సంగారెడ్డిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీ!
సంగారెడ్డి: యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, వాలంటీర్లు కలిసి మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, కుటుంబాలపై పడే ప్రభావం, యువత భవిష్యత్తుపై కలిగే దుష్పరిణామాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్పర్సన్ శ్రీమతి వనజ రెడ్డి, జిల్లా వైస్ చైర్మన్ శ్రీ చందర్, జిల్లా కోశాధికారి డాక్టర్ ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ ఆకాశ ప్రీతం, JRC & YRC కోఆర్డినేటర్ శ్రీ లింగాగౌడ్, మేనేజింగ్ కమిటీ సభ్యులు, వాలంటీర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గాయత్రి స్కూల్, భారతీయ విద్యా మందిర్ స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తమ ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై దృష్టి సారించాలని సందేశాన్ని ఇచ్చారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువత, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
“మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం – ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం” అనే నినాదంతో నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా మత్తు పదార్థాల రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సందేశాన్ని వ్యాప్తి చేశారు.




