Sangareddy: పండుగ సాయన్నకు నివాళులర్పించిన ఎస్పీ పరితోష్ పంకజ్
Sangareddy: పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు.
Sangareddy: పండుగ సాయన్నకు నివాళులర్పించిన ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జిల్లా: సురక్ష ప్రతినిధి: గురువారం 22 అక్టోబర్ - పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. ప్రజల కోసం నిలబడిన ధైర్యశాలిగా, అన్యాయాన్ని ఎదిరించి బలహీన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తిగా పండుగ సాయన్న గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
ఆయన జీవితం ధైర్యం, పోరాట పటిమ, ప్రజల పట్ల బాధ్యతకు ప్రతీక అని తెలిపారు. ముఖ్యంగా యువత అన్యాయానికి దూరంగా ఉంటూ, న్యాయం వైపు నిలబడాలని, సమాజంలో శాంతి, సామరస్యం, సమానత్వం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.
పోలీసులుగా ప్రజల భద్రతను కాపాడటం, బలహీనులకు అండగా నిలవడం, బాధితులకు చట్ట పరిధిలో న్యాయం అందించడం తమ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలన్నారు.
పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహనీయుల సేవలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు చేరుతాయని తెలిపారు.
పండుగ సాయన్న గారి ఆశయాలను స్మరించుకుంటూ, సమానత్వం, న్యాయం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, ఏఆర్ డిఎస్పీ నరేందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్ ఐ లు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్ కార్యాలయ సిబ్బంది తదితరుల పాల్గొన్నారు.




