Medak: ఆటో వద్దకే వెళ్లి వృద్ధురాలి బాధలు విన్న వైనం!
Medak: కుమారుడి వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు నడవలేని స్థితిలో ఆటోలో వచ్చిన వృద్ధురాలి వద్దకే స్వయంగా వెళ్లి ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సమస్యను అడిగి తెలుసుకున్నారు.
Medak: ఆటో వద్దకే వెళ్లి వృద్ధురాలి బాధలు విన్న వైనం!
మెదక్: కారణ్య నియామకం ద్వారా పెద్ద కుమారుడికి ఉద్యోగం ఇప్పించిన అనంతరం, తన బాగోగులు పట్టించుకోకుండా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ క్యాన్సర్‌తో బాధపడుతూ, నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు సోమవారం ప్రజా వాణి జిల్లా పోలీసు కార్యాలయానికి ఆటోలో వచ్చి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్వయంగా ఆటో వద్దకు వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మెదక్ టౌన్ సీఐ మహేష్‌ను జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి, వృద్ధురాలి ఫిర్యాదుపై వెంటనే విచారణ చేపట్టి, వాస్తవాలను నిర్ధారించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వృద్ధుల పట్ల నిర్లక్ష్యం, వేధింపులను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారని, తల్లిదండ్రుల సంక్షేమాన్ని చూడటం ప్రతి సంతానం బాధ్యత అని పేర్కొన్నారు. వృద్ధులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా పోలీసులను ఆశ్రయించాలని, వారికి చట్టపరంగా పూర్తి సహాయం అందిస్తామని తెలిపారు.




