Narsapur: విద్యార్థినికి ఆకులు తినిపించిన ఘటన: ప్రిన్సిపాల్, టీచర్ సస్పెన్షన్!

Narsapur: గిరిజన గురుకుల బాలికల కళాశాలలో విద్యార్థినికి ఆకులు తినిపించిన దారుణ ఘటనపై అధికారులు విచారణ జరిపారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రిన్సిపాల్ రజిని, ఉపాధ్యాయురాలు శ్రీలతలను సస్పెండ్ చేశారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 8 Oct 2026 10:31 PM IST
Narsapur
X

Narsapur: విద్యార్థినికి ఆకులు తినిపించిన ఘటన: ప్రిన్సిపాల్, టీచర్ సస్పెన్షన్!

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినికి ఆకులు తినిపించిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనపై వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన అధికారులు.. విధుల్లో నిర్లక్ష్యం, విద్యార్థుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు తేలడంతో ప్రిన్సిపాల్ రజినీతోపాటు పీజీటీ డి.శ్రీలతపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించినట్లు గిరిజన సంక్షేమ గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ తెలిపారు. విచారణ అనంతరం నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పించినట్లు పేర్కొన్నారు.

విద్యార్థినుల పట్ల సిబ్బంది వ్యవహరించే తీరు, కళాశాలలో వారి భద్రత, సంక్షేమం వంటి అంశాలపై విచారణలో అధికారులు దృష్టి సారించినట్లు తెలిపారు. విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించారనే ఫిర్యాదులు రావడంతో సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని గంగారాం నాయక్ వెల్లడించారు.

ఈ ఘటనలో బాధ్యులుగా పేర్కొన్న ప్రిన్సిపాల్ రజినీ, పీజీటీ డి.శ్రీలతలను సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు. పూర్తి విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌తోపాటు గిరిజన గురుకులం కార్యదర్శి సీతాలక్ష్మికి పంపనున్నట్లు తెలిపారు.

విద్యార్థుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గురుకులాల్లో విద్యార్థులకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించేలా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR