Narsapur: నర్సాపూర్ అడవుల్లో 'స్లీవ్స్ అప్' క్లీనింగ్ డ్రైవ్
Narsapur: నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకై SWAN, ఫౌంటెన్‌హెడ్ గ్లోబల్ స్కూల్, యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు.
Narsapur: నర్సాపూర్ అడవుల్లో 'స్లీవ్స్ అప్' క్లీనింగ్ డ్రైవ్
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సేవ్ వాటర్ అండ్ నేచర్ (SWAN), ఫౌంటైన్చేడ్ గ్లోబల్ స్కూల్, యూత్ ఫర్ సేవ (YFS) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అటవీ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేశ్ యాదవ్ పాల్గొని అటవీ ప్రాంతంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా మారిందని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, వాకింగ్ క్లబ్ సభ్యులు, సామాజిక సేవకులు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అటవీ ప్రాంతాన్ని పరిశుభ్రపరిచారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించడం ద్వారా ప్రకృతిని సంరక్షించవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా SWAN మరియు ఫౌంటైన్చేడ్ గ్లోబల్ స్కూల్ ప్రతినిధి శ్రీమతి మేఘనా ముసునూరి మాట్లాడుతూ, "మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రకృతిని కాపాడటం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అని పేర్కొన్నారు.
ఈ పరిశుభ్రత కార్యక్రమం ద్వారా అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపుతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందిందని నిర్వాహకులు తెలిపారు.




