Narsapur: నర్సాపూర్‌లో ఘనంగా శాఖాహార ర్యాలీ

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పిరమిడ్ సొసైటీస్ ఆధ్వర్యంలో శాఖాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

G Ashok Reddy, Narsapur
Published on: 9 Aug 2026 1:41 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో ఘనంగా శాఖాహార ర్యాలీ

నర్సాపూర్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పట్టణంలో పిరమిడ్ సొసైటీస్ ఆధ్వర్యంలో శాఖాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా ఆటపాటలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా శాఖాహారం, ధ్యానం, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పిరమిడ్ వ్యవస్థాపకులు సత్యనారాయణ లక్ష్మి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ మాట్లాడుతూ.. జంతుహింసను నివారించాలని, మాంసాహారాన్ని విడనాడి శాఖాహారాన్ని స్వీకరించాలని పిలుపునిచ్చారు. జంతువులను హింసించి చంపి ఆహారంగా తీసుకోవడం మానవాళికి హానికరమని, జీవకారుణ్యాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

జంతుబలిని పూర్తిగా నిలిపివేయాలని, లోకక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రాణుల పట్ల దయ, కరుణతో వ్యవహరించాలని వారు కోరారు. మాంసాహారానికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.

అలాగే ప్రతిరోజూ ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా “శ్వాసపై ధ్యాస” పెట్టి ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. శాఖాహారం, ధ్యానం కలిపి ఆరోగ్యకరమైన జీవన విధానానికి దోహదపడతాయని వివరించారు.

పిరమిడ్ ధ్యానం, పిరమిడ్ నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక సాధనకు ప్రాధాన్యత లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుని శాఖాహారం, ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ర్యాలీలో పిరమిడ్ సొసైటీస్ ప్రతినిధులు, సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story