Sangareddy: సువర్ణ దుర్గ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం... ఉద్రిక్తత!

Sangareddy: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ శివారులోని సువర్ణ దుర్గ పేపర్ పరిశ్రమలో మహిళా కార్మికురాలు సుమతి మరాండి పేపర్ మిషన్‌లో పడి మృతి చెందారు.

G Ashok Reddy, Narsapur
Published on: 5 Sept 2026 10:53 PM IST
Sangareddy
X

Sangareddy: సువర్ణ దుర్గ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం... ఉద్రిక్తత!

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని సువర్ణ దుర్గ పేపర్ పరిశ్రమలో మహిళా కార్మికురాలు సుమతి మరాండి పేపర్ మిషన్‌లో పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

బంధువులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమతి పరిశ్రమలో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు పేపర్ మిషన్‌లో పడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు.

ప్రమాదం జరిగితే కుటుంబానికి సమాచారం ఎందుకు ఇవ్వలేదు?

సుమతి సాయంత్రం 5:30 గంటల తర్వాత ఇంటికి రావాల్సి ఉండగా, సమయానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్దకు వెళ్లి ఆరా తీశారు. అక్కడే ఆమె మృతి చెందిన విషయం తెలిసిందని బంధువులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా విషయం గోప్యంగా ఉంచారని వారు ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా కుటుంబానికి సమాచారం అందకపోవడంపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భద్రతా ప్రమాణాలు ఎక్కడ?

పేపర్ మిషన్‌ల వద్ద కార్మికుల భద్రత కోసం అవసరమైన రక్షణ చర్యలు, భద్రతా పరికరాలు, పర్యవేక్షణ వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి.

యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా లోపాల కారణంగానే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

గతంలోనూ ప్రమాదాలు జరిగాయంటున్న కార్మికులు

పరిశ్రమలో గతంలోనూ పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని తోటి కార్మికులు ఆరోపించారు. వరుస ప్రమాదాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పరిశ్రమలో కార్మికుల భద్రతా ప్రమాణాలపై అధికారులు పూర్తిస్థాయి తనిఖీ నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కంపెనీ ఎదుట ఆందోళన

సుమతి మృతి విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు, తోటి కార్మికులు పరిశ్రమ ప్రధాన గేటు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.

మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసుల బందోబస్తు

సమాచారం అందుకున్న హత్నూర ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి సిబ్బందితో కలిసి పరిశ్రమ వద్దకు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని సముదాయిస్తూ పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు చేపట్టారు.

విచారణతోనే తేలనున్న అసలు నిజాలు

పేపర్ మిషన్ వద్ద భద్రతా ప్రమాణాలు పాటించారా? మిషన్‌కు రక్షణ ఏర్పాట్లు ఉన్నాయా? కార్మికులకు అవసరమైన భద్రతా శిక్షణ ఇచ్చారా? ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? గతంలో జరిగినట్లు చెబుతున్న ప్రమాదాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు అధికారుల విచారణలో సమాధానం రావాల్సి ఉంది.

సుమతి మృతి ఘటన నేపథ్యంలో సువర్ణ దుర్గ పేపర్ పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై సమగ్ర తనిఖీ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బంధువులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారుల విచారణ అనంతరం వెల్లడికావాల్సి ఉంది.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story