7 Dogs Movie Review: సల్మాన్, సంజయ్ దత్ యాక్షన్ బొమ్మ.. ‘7 డాగ్స్’ ఎలా ఉందంటే?

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చాక ప్రపంచ సినిమా మన ఇంటి ముంగిటికే వచ్చేసింది. భాషతో సంబంధం లేకుండా వేరే దేశాల చిత్రనిర్మాతలు, కళాకారుల ప్రతిభను మన

G Krishna
Published on: 22 Aug 2026 4:14 PM IST
7dogs
X

7dogs

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చాక ప్రపంచ సినిమా మన ఇంటి .0ముంగిటికే వచ్చేసింది. భాషతో సంబంధం లేకుండా వేరే దేశాల చిత్రనిర్మాతలు, కళాకారుల ప్రతిభను మన ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే విభిన్న వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో భారీ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా సౌదీ అరేబియాకు చెందిన భారీ యాక్షన్ చిత్రం '7 డాగ్స్' (7 Dogs) భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైంది. బాలీవుడ్ సూపర్‌స్టార్లు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లతో పాటు అంతర్జాతీయ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

అసలు కథేంటి?

ఇంటర్పోల్ అధికారి ఖాలిద్ అల్-జాజీ (అహ్మద్ ఎజ్) ఒక విమానంలో ఘైలీ (కరీం అబ్దేల్ అజీజ్) అనే క్రిమినల్‌ను పట్టుకోవడంతో కథ ప్రారంభమవుతుంది. ఘైలీ '7 డాగ్స్' అనే ప్రమాదకరమైన నేర సంస్థతో సంబంధాలు కలిగి ఉంటాడు. ఈ సంస్థ 'పింక్ లేడీ' అనే ప్రమాదకరమైన డ్రగ్స్‌ను భారీగా అక్రమంగా రవాణా చేస్తూ ఉంటుంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఖాలిద్, ఇకపై రిస్క్ ఉన్న మిషన్లకు వెళ్లకుండా ప్రశాంతంగా డెస్క్ జాబ్ చేసుకోవాలని అనుకుంటాడు.

అయితే ఘైలీ పట్టుబడటంతో '7 డాగ్స్' గ్యాంగ్ తమ వ్యూహాన్ని మారుస్తుంది. అరేబియాకు భారీ ఎత్తున మత్తుపదార్థాలను మళ్లించడానికి ప్లాన్ చేస్తుంది. ఈ నెట్‌వర్క్‌ను గుప్పెట్లో పెట్టడానికి ఖాలిద్‌ను మళ్లీ రంగాంలోకి దించుతారు. విధిలేని పరిస్థితుల్లో ఖాలిద్‌తో కలిసి పనిచేయడానికి ఘైలీ కూడా చేతులు కలుపుతాడు. ఈ ప్రమాదకరమైన ఆపరేషన్ వేటలో ఖాలిద్‌కు జోహార్ (సల్మాన్ ఖాన్) ఎలా సహాయం చేశాడు? చివరికి ఆ డ్రగ్ రాకెట్‌ను ఎలా అంతమొందించారు అనేది మిగతా కథ.

స్క్రీన్‌ప్లే సాధారణమే కానీ.. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్..

రచయిత మొహమ్మద్ ఎల్-దబాహ్ రాసిన స్క్రీన్‌ప్లే క్రైమ్ థ్రిల్లర్ల కోణంలో పెద్దగా కొత్తగా ఏమీ అనిపించకపోవచ్చు, కానీ దీనిని ఒక హై-వోల్టేజ్, స్టైలిష్ యాక్షన్ చిత్రంగా మలచడంలో దర్శకులు ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు తీర్చిదిద్దారు. సినిమాలో అనేక పాత్రలు, వాటి వెనుక సొంత జీవితాలు ఉన్నప్పటికీ కథ ఎక్కడా గందరగోళం కాకుండా చాలా సులభంగా అర్థమవుతుంది.

విమానంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ నుంచి ఎడారి ఇసుక తిన్నెలలో సాగే కార్ ఛేజింగ్స్, గన్ ఫైట్లు , బాహాబాహీ పోరాటాలు ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే పేలుడు స్టంట్ సీన్స్ గగుర్పాటు కలిగిస్తాయి. తలకు అయ్యే గాయాలు, గాయాలకు కుట్లు వేసే సన్నివేశాలు చాలా సహజంగా, అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే ఈ యాక్షన్ డ్రామాలో మహిళా పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యతతో పాటు స్పాట్‌లైట్ లభించింది. కథనం చాలా వేగంగా సాగడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు.

హాలీవుడ్ స్థాయి మేకింగ్ & టెక్నికల్ మార్క్స్

హాలీవుడ్ హిట్ మూవీ 'బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై'కి దర్శకత్వం వహించిన ఆదిల్ అల్ అర్బి, బిలాల్ ఫల్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో వారు వందకి వంద శాతం విజయం సాధించారు. సినిమాటోగ్రాఫర్ రాబ్రెక్ట్ హెవెట్ అందించిన విజువల్స్, ఎడిటర్ పీటర్ స్మెట్ పదునైన కటింగ్స్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. నేపథ్యంగా వినిపించే అరబిక్ సంగీతం అక్కడ సంస్కృతికి తగ్గట్లుగా బాగానే ఉన్నా, కొన్ని కీలకమైన సన్నివేశాల్లో బిగ్గరగా రావడం వల్ల సంభాషణలు సరిగ్గా వినబడకపోవడం చిన్న లోపం.

నటీనటుల పనితీరు.. సల్మాన్, సంజయ్ దత్ మ్యాజిక్..

నటుడిగా అహ్మద్ ఎజ్ తన ఖాలిద్ పాత్రలో జీవించేశాడు. సీనియర్ నటుడు కరీం అబ్దేల్ అజీజ్ ఆయనకు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి మధ్య సాగే 'లవ్ అండ్ హేట్' కామిక్ టైమింగ్ కథకు మంచి రిలీఫ్ ఇస్తుంది. ప్రతినాయకిగా మోనికా బెల్లూచీ గ్లామరస్‌గా కనిపిస్తూనే, విలనిజంతో భయపెడుతుంది.

ఇక మన ఇండియన్ స్టార్స్ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌లు తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో థియేటర్లలో/స్క్రీన్లపై మాయాజాలం చేశారు. సాధారణంగా మన హిందీ సినిమాల్లో కనిపించే లార్జర్ ద్యాన్ లైఫ్ మాస్ హీరో రోల్స్‌కు భిన్నంగా, ఈ అంతర్జాతీయ చిత్రంలో చాలా డిఫరెంట్‌గా, కథకు తగ్గట్లుగా వారి పాత్రలు ఉండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నటీనటులందరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం సినిమా ప్రేమికులకు ఒక గొప్ప వీక్షణ అనుభవాన్ని ఇస్తుంది. విభిన్నమైన మేకింగ్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ ఇష్టపడే వారికి '7 డాగ్స్' ఒక పర్ఫెక్ట్ వీకెండ్ చాయిస్..

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story