Dark Night Movie Review: వివాహేతర సంబంధాలు.. అనూహ్య మలుపులు! పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Dark Night Movie Review: పూర్ణ ప్రధాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ “డార్క్ నైట్”. జి.ఆర్. ఆదిత్య కథ రాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి19 స్టూడియోస్ బ్యానర్‌పై సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు.

Arun Chilukuri
Updated on: 13 March 2026 3:47 PM IST
Dark Night Movie Review: వివాహేతర సంబంధాలు.. అనూహ్య మలుపులు! పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
X

Dark Night Movie Review: వివాహేతర సంబంధాలు.. అనూహ్య మలుపులు! పూర్ణ ఎమోషనల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Dark Night Movie Review: పూర్ణ ప్రధాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ “డార్క్ నైట్”. జి.ఆర్. ఆదిత్య కథ రాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి19 స్టూడియోస్ బ్యానర్‌పై సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. ఇటీవల సమాజంలో భార్య–భర్తల మధ్య జరిగే వివాహేతర సంబంధాలు, ద్రోహం, క్రైమ్ ఘటనలు తరచుగా వార్తల్లో కనిపిస్తున్నాయి. అలాంటి సంఘటనల నేపథ్యంలో, దంపతుల మధ్య విశ్వాసం ఎంత ముఖ్యమో చెప్పే కథతో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 13న థియేటర్లలో విడుదలైంది.

కథ

న్యాయవాది అలెక్స్ (విధార్థ్) మరియు హేమ (పూర్ణ) పెద్దల నిర్ణయంతో పెళ్లి చేసుకుంటారు. అయితే వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగదు. కారణం, అలెక్స్ తన కార్యాలయంలో పనిచేసే సోఫియా (సుభాశ్రీ రాయగురు)తో వివాహేతర సంబంధం కొనసాగించడం. ఈ విషయం తెలిసిన హేమ బాధతో అతన్ని విడిచి వెళ్లిపోతుంది.

ఇక మరోవైపు, సోఫియా కూడా జిమ్ ట్రైనర్‌తో సంబంధం పెట్టుకున్నట్లు తెలిసి అలెక్స్ తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు. తాను మోసపోయానని గ్రహించిన అతను తిరిగి హేమ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతూ, తన జీవితంలోకి మళ్లీ రావాలని కోరుకుంటాడు.

ఇదిలా ఉండగా, ఒక సంవత్సరం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమ కారణంగా గాయపడ్డ రోషన్ (త్రిగుణ్ / ఆదిత్ అరుణ్) అనే అనాధ యువకుడిని ఆమె కలుస్తుంది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారుతుంది. హేమ అతనిలో ఒక మంచి స్నేహితుడిని మాత్రమే చూస్తుంది. కానీ రోషన్ మాత్రం ఆ అనుబంధాన్ని వేరే కోణంలో భావిస్తాడు.

అలెక్స్–హేమ మధ్య సంబంధం మళ్లీ సరిదిద్దుకుంటుందనుకున్న సమయంలో ఒక అనూహ్య విషాద సంఘటన జరుగుతుంది. హేమ భర్తను విడిచి వెళ్లిన తర్వాత రోషన్ ఏం చేస్తాడు? భర్త ఉన్న సమయంలోనే అతను హేమ గదిలోకి ఎందుకు వస్తాడు? అది వారి వివాహ జీవితం మీద ఎలా ప్రభావం చూపుతుంది? చివరికి హేమ జీవితం ఎటు దారి తీస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్రదర్శన

హేమ పాత్రలో పూర్ణ అచ్చతెలుగు గృహిణిలా ఎంతో సహజంగా కనిపించింది. నిరాశ, బాధ, అసహాయత వంటి భావోద్వేగాలను ఆమె చాలా సహజంగా వ్యక్తపరిచింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

రోషన్ పాత్రలో త్రిగుణ్ ఈ జనరేషన్ యువకుడి భావజాలాన్ని బాగా చూపించాడు. అతని నటన కొన్ని సన్నివేశాల్లో హైలైట్‌గా నిలుస్తుంది. భర్త పాత్రలో విధార్థ్ తన పాత్రకు తగినట్టుగా నటించాడు. అలాగే తెలుగు అమ్మాయి సుభాశ్రీ రాయగురు తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.

సాంకేతిక వర్గం పనితీరు

సినిమా ప్రారంభంలో వినిపించే “Hell is empty, and all the devils are here” అనే విలియం షేక్స్పియర్ ప్రసిద్ధ వాక్యం కథ యొక్క భావాన్ని ప్రతిబింబిస్తుంది. దర్శకుడు ఆదిత్య ప్రేమ, నిరాశ, వివాహేతర సంబంధాలు మరియు నేరం వంటి అంశాలతో కూడిన సాధారణ కథను కొంచెం భిన్నంగా చెప్పే ప్రయత్నం చేశాడు.

ప్రత్యేకంగా కథను హేమ దృష్టికోణం నుంచి చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. రోషన్‌తో హేమకు ఏర్పడే అనుబంధాన్ని కూడా దర్శకుడు కొంతవరకు సమర్థించేలా చూపించారు. కథలో చివర్లో వచ్చే అతీంద్రియ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

సంగీత దర్శకుడు మిస్కిన్ అందించిన పాటలు మరియు నేపథ్య సంగీతం సినిమాకు మంచి భావోద్వేగాన్ని అందించాయి. సంగీతంలో ఇళయరాజా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్ ముత్తు కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా రాత్రి సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పరవాలేదనిపిస్తుంది. నిర్మాత నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ

ఆసక్తికరమైన కథాంశం, భావోద్వేగాలు మరియు ఉత్కంఠ కలగలిపిన కథనంతో “డార్క్ నైట్” ప్రేక్షకులకు ఎమోషనల్ థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది. రెండు గంటల పాటు కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులను కథతో మమేకం చేస్తాయి.

ప్రస్తుతం సమాజంలో భార్య–భర్తల మధ్య జరిగే విభేదాలు, ద్రోహం వంటి అంశాలు వార్తల్లో తరచూ వినిపిస్తున్న నేపథ్యంలో, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సినిమా చూపించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా దంపతులు కలిసి చూసే సినిమాగా ఇది నిలుస్తుంది. మంచి సందేశంతో వచ్చిన ఈ చిత్రం ఒక సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌లా అనిపిస్తుంది.

రేటింగ్: 2.75/5

Arun Chilukuri

Arun Chilukuri

Next Story